ఇరాన్‌లో కరోనా మరణమృదంగం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2020 4:15 PM GMT
ఇరాన్‌లో కరోనా మరణమృదంగం..

చైనాను వణికించి ప్రపంచదేశాలకు పాకిన కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ఇరాన్‌లో మరణ మృదంగం వాయిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఒక్కరోజే 49 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి యానుష్ జహాన్‌పూర్ ఆదివారం తెలిపారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 194 మంది ప్రాణాలు కోల్పోయారు. 6566 మంది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇరాన్‌లో అక్కడా, ఇక్కడా అని కాకుండా మొత్తం 31 ప్రావిన్సులకు కరోనా పాకింది.

వైరస్‌ కారణంగా ఇరాన్‌ మాజీ దౌత్యాధికారి హోసేన్ షేఖోస్లామ్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ వార్త మరువముందుకే మరో ప్రజాప్రతినిధిని కరోనా కబలించింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఫతేమహ్ రహబర్ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్‌ మీడియా పలు కథనాలను వెల్లడించింది

కరోనా వైరస్ ప్రభావం చైనా తర్వాత ఇరాన్ పైనే అత్యధికంగా ఉంది. ఆ దేశం చేసిన నిర్లక్ష్యమే అందుక్కారణం. ఫిబ్రవరి 19న ఇరాన్‌లో తొలి కేసు నమోదైంది. వెంటనే మేల్కొని ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదని విమర్శలు వస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో అన్ని దేశాలు ముందస్తు చర్యలు ప్రారంభించినా.. ఆ వైరస్ తమను ఏమీ చేయలేదన్నట్లుగా ఇరాన్ చూస్తుండిపోయింది. ఆ తర్వాత మేల్కొనేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

మరోవైపు ఇటలీలోనూ కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆ దేశంలో కరోనా ధాటికి ఇప్పటి వరకు 234 మృతి చెందగా.. 1247 కరోనా కేసులు నమోదయ్యాయి.

Next Story