నేనెందుకు 30 ఏళ్ళ క్రితం కశ్మీర్ లోయను వదిలేశాను?

By అంజి  Published on  25 Jan 2020 11:45 AM GMT
నేనెందుకు 30 ఏళ్ళ క్రితం కశ్మీర్ లోయను వదిలేశాను?

ఇక్బాల్ కిషన్ పండిత్

నేనొక 53-ఏళ్ల కశ్మీరీ పండిత్ ని. నా జీవితంలో రెండు భాగాలున్నాయి. తొలి 24 ఏళ్లు, నేను కశ్మీర్ లో గడిపాను. మిగతా జీవితాన్ని నేను దేశంలోని వివిధ ప్రాంతాల్లో గడిపాను. నేనెక్కడ జీవించినా నాకు ప్రేమ, ఆప్యాయతలు పుష్కలంగా లభించాయి. ప్రతి చోటా ప్రజలు నీ సొంతూరు ఏది అని అడిగేవారు. నేనుప్పుడూ “నేనొక కశ్మీరీ పండిత్ ని” అని చెప్పుకునేవాడిని.

నేను క్రాంగ్సూ అనే గ్రామానికి చెందిన వాడిని. అది మార్తాండ్ మందిరానికి వెళ్లే దారిలో ఉన్న అనంతనాగ్ టౌన్ కి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామం. 1986 నుంచి చాలా మందిరాలు బుగ్గి అయిపోయాయి. కశ్మీరీ సొసైటీ మతం ఆధారంగా రెండు ముక్కలైపోయింది. సంఖ్యాధికులు అంటే మెజారిటీ వర్గానికి చెందిన వారు అతివాదుల గుప్పెట్లోకి వెళ్లిపోయారు. సరిహద్దుకి అటు వైపు నుంచి వచ్చిన ఉగ్రవాదుల పట్ల వారికి సానుభూతి ఉండేది. లేదా వారి ప్రభావంలో ఉండేవారు. దీని వల్ల తీవ్రవాదం పెరిగింది. కిడ్నాపులు, నిరసన ప్రదర్శనలు సర్వసాధారణమైపోయాయి.

ఆ సమయంలో మసీదులు ఆజాదీ నినాదాలను, సందేశాలను, పాకిస్తాన్ అనుకూల ప్రచారాన్ని చేసేవి. ప్రతి శుక్రవారం ప్రార్థనలు జరిగే సమయానికి కశ్మీర్ పాకిస్తాన్ లో చేరిపోయిందని భావించేవారు. నిజమైన కశ్మీరీలు గొంతెత్తితే (ఇందులో హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఉన్నారు) గొంతెత్తితే అత్యంత కిరాతకంగా చంపేసేవారు. ఇలా చనిపోయిన వారిలో ఎక్కువగా హిందువులు ఉండేవారు. కొద్ది మంది ముస్లింలను కూడా ఇన్ఫార్మర్లుగా ముద్ర వేసి చంపేవారు.

ఆ రోజుల్లో కశ్మీరీ పండిత్‌ల బ్రతుకు దుర్భరంగా ఉండేది. మనుగడ సాగించడమే కష్టంగా ఉండేది. వారితో చాలా కాలం సఖ్యతగా నివసించిన ముస్లింలు “నిజామె ముస్తఫా” కావాలని కోరుకునేవారు. రెండో కారణం ఏమిటంటే కశ్మీరీ హిందూ మహిళలు సామూహిక బలాత్కారాలకు, హత్యలకు గురయ్యేవారు. చివరికి జనవరి 19, 1990 నాటికి పరిస్థితి ఇక భరించలేని స్థాయికి చేరుకుంది. మెజారిటీ సముదాయం ప్రజలు ఊరేగింపులు తీసి, కశ్మీరీ హిందువులను కూడా అందులో పాలు పంచుకొమ్మని డిమాండ్ చేశారు. అన్ని ప్రధాన పత్రికల్లో తుది హెచ్చరికలు జారీ అయ్యాయి. కశ్మీరీ హిందువుల తలుపులకు వాటిని అంటించేవారు.

వలస వెళ్లే పరిస్థితులు

ఇరవై నాలుగు గంటల్లో కశ్మీర్ లోయయను వదిలి వెళ్లిపోవాలని లేదా పరిణామాలను ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇవన్నీ మానసిక ఒత్తిడికి, భయానికి, ఆందోళనకుగురిచేశాయి. మహిళలను కాపాడుకోలేమేమోనన్న భయాలు కలిగాయి. వీటి వల్లే కశ్మీరీ హిందువులు దేశంలోని నలు మూలలకు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు వచ్చాయి.

నేను అప్పట్లో యూనియన్ కార్బైడ్ లో పనిచేసేవాడిని, నేను హిందువులు తరలి వెళ్లిపోవడాన్ని చూస్తూ ఉండేవాడిని. జనవరి 19, 1990 తరువాత కిడ్నాపులు, హత్యలు సర్వసాధారణమైపోయాయి. యూనియన్ కార్బైడ్ ఉద్యోగులు కూడా రోజుకొకరు చనిపోతూ ఉండేవారు. ఒక సందర్భంలో నేను మూడు రోజులు ఫ్యాక్టరీలోనే తాళాలు వేసుకుని లోపల ఉండిపోవాల్సి వచ్చింది. బయట కర్ఫ్యూ ఉండేది. నా తండ్రి జమ్మూ కశ్మీర్ పోలీసుశాఖలోని సీ ఐడీ విభాగంలో పనిచేసేవారు. బాంబు పేలుళ్లు అయిన తరువాత ఆయన ఘటనా స్థలానికి వెళ్లాల్సి వచ్చేది. దాంతో ఆయన ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో చేరిపోయారు. మా కుటుంబమంతా ఆయన గురించి కలవరపడేది.

4 నెలల్లో తిరిగివస్తామనుకున్నాం..

చివరికి అప్పుడే కట్టుకుంటున్న మా ఇంట్లో మా నాన్నను రెండు నెలల పాటు దాచి ఉంచాల్సి వచ్చింది. చివరికి పరిస్థితులను చూసి, బయట తిరగలేని, బ్రతకలేని, మిత్రులతో మాట్లాడలేని చోట ఉండలేమని మా నాన్నగారిని ఒప్పించాము. ఇదంత సులువుగా తీసుకున్న నిర్ణయం కాదు. చివరికి మా ఇరుగూ పొరుగున ఉన్న మెజారిటీ సమాజం సభ్యులు కూడా మమ్మల్ని ఊరు వదిలేసి వెళ్లిపొమ్మని చెప్పారు. చివరికి మేము ఒక మూడు నాలుగు నెలల్లో తిరిగివస్తామన్న ఆశతో మా కన్న ఊరును, ఉన్న ఊరును వదిలి రావలసి వచ్చింది.

చివరికి ఏప్రిల్ 22, 1990 నాడు నేను, మా నాన్న తెల్లవారు జామునే మా ఉన్ని కోటు ఫేరన్ ను ధరించి, ఒక తువాలును భుజాన వేసుకుని, స్నానానికి నదికి వెళ్తున్నట్టుగా బయలుదేరి వచ్చేశాం. ఆ తరువాత మేం వెనక్కి చూడకుండా ఖానాబల్ కి వచ్చాం. అక్కడ మేకు ఒక బస్సు ఎక్కి సాయంత్రానికి జమ్మూకి వచ్చేశాం. కానీ మాకు ఎక్కడికి వెళ్లాలో తెలియదు. మా వెంట మా వదిన (అప్పుడు ఆమె గర్భవతి), ఆమె మూడేళ్ల పాపను తీసుకుని వచ్చేశాం. మా అమ్మ, పెద్దన్నయ్య, అతని కుటుంబం, ఇంకో అన్నయ్య లను కశ్మీర్ లోనే ఉంచి వచ్చాం.

కశ్మీరీ శరణార్థుల శిబిరం

పరిస్థితి రెండు మూడు నెలల్లో బాగుపడుతుందని, మేం మళ్లీ వెళ్లవచ్చునని భావించాం. కానీ అది జరగలేదు. ఇప్పటికీ తిరిగి వెళ్లడం కలగానే మిగిలిపోయింది. నా తండ్రి మళ్లీ కశ్మీర్ కు వెళ్ళాలని కోరుకుంటూ కోరుకుంటూనే కాలం చేశారు. జమ్మూ మాకొక కొత్త ప్రదేశం. ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో మాకు తెలియలేదు. ఆ సమయంలో ఒక మిత్రుడు, బంధువు కలిశారు.

వారికి జగ్తీ అనే చోట కేటాయించిన కశ్మీరీ శరణార్థుల శిబిరంలో మమ్మల్ని కూడా ఉండనిచ్చారు. ఆ శిబిరం ఒక గుడారం. అది జమ్మూ లోని జ్యుయెల్ చౌక్ నుంచి పన్నెండు కిలో మీటర్ల దూరంలో ఉంది. అక్కడ మేం ఏవో రెండు మెతుకులు గతికాం. మేము పూ్ర్తిగా షాక్ లో ఉన్నాం. చుట్టూ ఉన్న పరిస్థితులను, ప్రజల భీతావహ దుస్థితిని ఎప్పటికీ మరిచిపోలేం. మాకు కశ్మీర్ లో చాలా పెద్ద ఇల్లు ఉండేది. ఇక్కడ జమ్మూలో మేము ఒకే గుడారంలో తొమ్మిది మంది ఉండేవాళ్లం.

ఆదుకుంటారని ఆశించాం..

కరెంటు వస్తూ పోతూ ఉండేది. మొత్తం క్యాంపుకి ఒకే ఒక లెట్రిన్ ఉండేది. మంచి నీటి కోసం గంటల పాటు లైన్ లో వేచి ఉండాల్సి వచ్చేది. బల్లులు, పాములు, తేళ్లు, జెర్రులు అక్కడ బోలెడు ఉండేవి. చాలా మంది కశ్మీరీ పండితులు పాము కాటు, తేలుకాటు వల్ల చనిపోయారు కూడా. కిరోసిన్ కావాలంటే నగరానికి పదికిమీ ప్రయాణించాల్సి వచ్చేది. జమ్మూ లో బాగా వేడిగా ఉండేది. ఆ ఎండలో గంటల పాటు క్యూలో ఉండాల్సి వచ్చేది. కశ్మీరీలకు ఎండ అంటే ఏమిటో తెలియదు. దాంతో చాలా మంది వడదెబ్బకు చనిపోయారు.

ఒక సారి ఒక పాము నా మేనకోడలి మీద నుంచి జరజర పాకుతూ వెళ్లింది. అది చూసి మేమంతా కొయ్యబారిపోయాం. కశ్మీరులో విషపూరితమైన పాములు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో అయిదేళ్ల పాటు ఏలాగోలా సర్దుకుపోయేందుకు ప్రయత్నించాం. మిగతా భారత దేశం మమ్మల్ని ఆదుకునేందుకు వస్తుందని మేం ఆశించాం

ఇప్పుటికి 3౦ ఏళ్లయిపోయింది. ఇప్పటికీ మా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. మా గురించి ఎలాంటి అవార్డు వాపసీలూ జరగలేదు. జమ్మూ లో, ఢిల్లీలో మా శరణార్థి శిబిరాలను చూసి కన్నీరు కార్చిన వారు లేరు.

వదలని ఆశలు..

మేం భారతీయులుగా ఉండాలనుకున్నందుకు, తమ ఓట్లకు చిల్లిగవ్వంత కూడా విలువలేని హిందూ మైనారిటీలుగా ఉన్నందుకు తగిన శిక్షను అనుభవించాం. సాహసం, ఓరిమి ఉండి మౌనంగా, సహనంతో కాలం గడిపాం. ఈ పరిస్థితుల్లోనూ ఓరిమి వీడకుండా జీవించాం. ఇన్ని కష్టాలను అనుభవించి కూడా మా మనుగడను నిలుపుకున్నాం. కేవలం కశ్మీరీ పండితులే ఇలా చేయగలరని ఒక మిత్రుడు నాతో అన్నాడు.

నా తండ్రికి క్యాన్సర్ వచ్చింది. నేను ఈ జీవన శైలి మార్పును జీర్ణించుకున్నట్టు ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఇరవై ఏళ్ల క్రితం ఆయన అందని లోకాలకు వెళ్లిపోయారు. అయితే మేం ఇంకా ఆశలు వీడలేదు. ఏదో ఒక రోజు తిరిగి వెళ్లి, గర్వంగా కశ్మీరీ పండిత్ గా కశ్మీర్ లో భయం, హింస లేకుండా బతకగలమని ఆశ ఉంది. అదొక్కటే మమ్మల్ని నడిపిస్తోంది. మళ్లీ అక్కడి వెళ్లాలని అనిపించేలా చేస్తోంది.

Next Story