చెన్నై ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు..!
By సుభాష్ Published on 20 Oct 2020 5:56 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో చెన్నై కథ ముగిసినట్లే. ఐపీఎల్ ప్రతి సీజన్‌లో ఆజట్టు ప్లేఆఫ్స్ చేరగా.. ఈ సీజన్‌లో చెన్నై ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యం. ఈ సీజన్ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరేట్లలో చెన్నై జట్టు ఒకటి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న ధోని.. మెరుపులు మెరిపిస్తాడని అభిమానులు భావించగా అలా జరగలేదు. వరుస ఓటములతో ఆ జట్టు డీలా పడింది. సోమవారం రాజస్థాన్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలైంది. దీంతో ఆ జట్టు టోర్నీలో ఏడో పరాజయాన్ని చవిచూసింది. ఆల్‌రౌండర్ ఆధిపత్యాన్ని చూపించిన రాజస్థాన్ నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. లీగ్ దశంలో చెన్నై ఇంకో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. ప్రస్తుతం చెన్నై పరిస్థితుల్లో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. ఓపెనర్లు శామ్ కరన్ (22; 25 బంతుల్లో 1ఫోర్, 1సిక్స్), ఫాఫ్ డుప్లెసిస్ (10; 9 బంతుల్లో 1పోర్) చెన్నై ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. మూడో ఓవర్‌లోనే చెన్నై వికెట్ చేజార్చుకోగా.. అనంతరం వచ్చిన షేన్ వాట్సన్ (8), అంబటి రాయుడు (13) లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(35; 30బంతుల్లో 4పోర్లు), ఎంఎస్ ధోనీ(28; 28బంతుల్లో 2పోర్లు) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇక రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వీరిద్దరు కూడా పరుగులు రాబట్టేందుకు చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో పరుగులు రాబట్టడం బ్యాట్స్‌మెన్లకు గగనమే అయింది. యితే ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ ధోనీ.. రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. ఆఖర్లో కేదార్ జాదవ్ (4 నాటౌట్; 7 బంతుల్లో) దూకుడుగా ఆడలేకపోయాడు. అయితే జడేజా కాస్త బ్యాట్ ఝళిపించడంతో చెన్నై 125 పరుగులు చేయగలిగింది.
చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యంను చేధించడానికి బరిలోకి రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. చెన్నై పేస్ బౌలర్ దీపక్ చాహర్ (2/18) చక్కని బౌలింగ్‌తో రాజస్థాన్ 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ (70 నాటౌట్; 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ హాఫ్ సెంచరీకి తోడు కెప్టెన్ స్టీవ్ స్మిత్ (26 నాటౌట్; 34 బంతుల్లో 2 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ మరో 15 బంతులు ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ రెండు, జోష్ హేజిల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.