అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద స్వామిజీ నిత్యానంద చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. నిత్యానంద ఆచూకీ తెలుసుకునేందుకు గుజరాత్‌ పోలీసులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి. వారి అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్‌ బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. ఆధ్యాత్మిక గురువుగా, బోధకుడిగా చెలామణీ అయిన నిత్యానంద పలుచోట్ల ఆశ్రమాలను ఏర్పాటు చేసి భక్తులను ఆకర్షించాడు. ముఖ్యంగా విదేశీయులను వశపరచుకోవడంలో ఆరితేరాడు. కోట్లాది రూపాయలను కూడబెట్టడమే కాదు. లైంగిక, అత్యాచార ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు. కొంత కాలం జైలు జీవితాన్ని గడిపిన నిత్యానంద ఇప్పుడు పరారీలో ఉన్నాడు.

గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క పోలీసుల వాంటెడ్ లిస్టులో ఉన్న నిత్యానంద. చిన్న పిల్ల‌ల‌ను సైతం అహ్మ‌దాబాద్ ఆశ్ర‌మంలో బంధించి.. లైంగికంగా వేధించిన‌ట్లు అత‌నిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆశ్ర‌మం నుంచి ఇద్ద‌రు అమ్మాయిలు అదృశ్య‌మైన కేసులో ఎఫ్ఐఆర్ కూడా న‌మోదు అయ్యింది. అహ్మదాబాద్‌లో నిత్యానందకు చెందిన యోగిణి సర్వజ్ఙపీఠంలో తన ఇద్దరు కుమార్తెలు లోపముద్ర, నందితలను నిర్భంధించారని, వారిపై నిత్యానంద అత్యాచారాలకు పాల్పడుతున్నారంటూ జనార్ధన శర్మ అనే వ్యక్తి గుజరాత్ హైకోర్టులో ఆశ్రయించారు. యోగిని సర్వజ్ఞపీఠం పేరుతో అహ్మదాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఈ ఆశ్రమం కొనసాగుతోంది. అదే ఆశ్రమంలో తన కుమార్తెలు బందీలుగా ఉన్నారంటూ గత ఏడాది నవంబర్‌లో జనార్ధన్ శర్మ హైకోర్టులను ఆశ్రయించారు.

Interpol issues Blue Corner Notice

ఆ తర్వాతి నుంచి నిత్యానంత కన్పించకుండా పోయాడు. ఈ నేపథ్యంలోనే ఈక్వెడార్‌లో కైలాసాన్ని నిర్మించ‌నున్నట్లు ఇటీవల ఓ వీడియోలో నిత్యానంద బహిరంగ ప్రకటన విడుదల చేశాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. అయితే ఆయనను ఈక్వెడార్‌లో లేర‌ని, హైతీకి పారిపోయిన‌ట్లు ఈక్వెడార్ ఎంబసీ స్పష్టం చేసింది. ఓ దీవిని కొని, దానికి కైలాసం అని నిత్యానంద‌ పేరుపెట్టినట్టు కూడా వార్తలు బలంగా వినిపించాయి.

కాగా, నిత్యానంద కేసు విషయంలో మరో ముందడుగు వేసే క్రమంలో భాగంగా గుజరాత్ పోలీసుల అభ్యర్థనపై ఇంటర్‌పోల్ సానుకూలంగా స్పందించింది. గుజరాత్ పోలీస్ డైరెక్టర్ జనరల్ పంపించిన కేసు వివరాలు, అహ్మదాబాద్ హైకోర్టు ఆదేశాలు.. ఇవన్నీ క్షున్నంగా పరిశీలించింది. అనంతరం నిత్యానందను అరెస్టు చేయడానికి తాజాగా బ్లూ కార్నర్ నోటీసులను జారీ చేసింది. బ్లూ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ జారీ చేసినట్టు అహ్మదాబాద్ నగర డిప్యూటీ కమిషనర్. తెలిపారు. దీన్ని రెడ్ కార్నర్ నోటీసుగా బదలాయించాలని కోరుతూ మరో ప్రతిపాదనలను పంపిస్తామని వెల్లడించారు.

సుభాష్

.

Next Story