నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత

By సుభాష్  Published on  13 Jan 2020 11:07 AM GMT
నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో ఆదివారం అర్థరాత్రి రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ వల్ల తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోర్వాగల్లిలో ఒక వర్గానికి చెందిన వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా మరో వర్గానికి చెందిన వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో రెండు వర్గాలు ఒకరిపై మరోకరు రాళ్లు రువ్వుకున్నారు. మూడు మోటర్‌ సైకిళ్ల, రెండు ఇళ్లను గుర్తు తెలియని దుండుగుల దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.

పోలీసులకు గాయాలు

ఈ హింసాకాండలో జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ శశిధర్‌ రాజు, భైంసా సీఐ వేణుగోపాల్‌ రావు, ముథోల్‌ ఎస్సై అశోక్‌, కానిస్టేబుళ్లు గాయపడ్డారు. మరికొందరికి కూడా ఈ ఘర్షణలో గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అల్లర్లు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు అధికారులు. నిందితుల కోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

144 సెక్షన్‌ అమలు

ఈ సందర్భంగా బైంసాలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. బైంసా మతపరంగా సున్నితమైన పట్టణం. బైంసాలో 2008లో రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణ నేపథ్యంలో బైంసాలో 144 సెక్షన్‌ అమలులో ఉంది. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరైన శాంతి భద్రతలకు విఘాత కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Next Story