చిలీలో కార్చిచ్చు, ఆగని మంటలు, 50 మందికి పైగా మృతి

దక్షిణ అమెరికా దేశం చిలీలో కార్చిచ్చు మొదలైంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు అంటుకున్నాయి.

By Srikanth Gundamalla  Published on  4 Feb 2024 5:46 AM GMT
Wildfires,  Chile,   50 people dead,

చిలీలో కార్చిచ్చు, ఆగని మంటలు, 50 మందికి పైగా మృతి 

దక్షిణ అమెరికా దేశం చిలీలో కార్చిచ్చు మొదలైంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు అంటుకున్నాయి. దాంతో.. ఆ మంటలు క్రమంగా పెరుగుతున్నాయి తప్ప అస్సలు తగ్గడం లేదు. దావానంలా వ్యాపిస్తున్న మంటల్లో ఇప్పటికే 50కి పైగా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక వేల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. దాదాపు 1,100 ఇళ్లు మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. భారీగా మంటలు చెలరేగుతున్నాయనీ.. వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయనీ.. వారికి ప్రజలంతా సహకారం అందించాలని చిలీ అధ్యక్షుడు బోరిక్ గాబ్రియెల్ కోరారు.



వాల్పరైసో రీజియన్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాంతో.. దట్టమైన పొగలు అమలుకున్నాయి. సెంట్రల్‌ చిలీలో సుమారు పది లక్షల మంది ఈ మంటల కారణంగానే నిరాశ్రయులయ్యారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. దాంతో.. వాటిని అదుపు చేసేందుకు మరింత ముందుకు చొచ్చుకురాకుండా ఉండేందుకు సహాయక బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. హెలికాప్టర్ల ద్వారా మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు కార్చిచ్చు ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చుపై చిలీ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిలీ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు గాయపడ్డ వారి అడ్మిట్‌తో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆస్పత్రులు దద్దరిల్లుతున్నాయి. ఇక ఎలాగైనా కార్చిచ్చుని ఆపే ప్రయత్నాలు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మునిగిపోయారు. కాగా.. కార్చిచ్చుకి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Next Story