కోవిడ్ లాంటిది కాదు.. మంకీపాక్స్‌పై WHO కీలక ప్రకటన
మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2024 3:14 PM GMTకోవిడ్ లాంటిది కాదు.. మంకీపాక్స్‌పై WHO కీలక ప్రకటన
మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఆఫ్రికా దేశాల్లో మొదలైన ఈ వైరస్ తాజాగా పాకిస్తాన్ వరకూ చేరింది. అంతేకాదు.. వందల మంది మంకీపాక్స్ వల్లచనిపోవడంతో భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. అలాగే డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. తాజాగా డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన అందరికీ స్వల్ప ఊరటనిస్తోంది.
మంకీపాక్స్ కరోనా వంటిది కాదని, ఈ వైరస్‌ను నియంత్రించవచ్చని వెల్లడించింది. డబ్ల్యుహెచ్‌వో యూరప్ రీజినల్ డైరెక్టర్‌గా విధులను నిర్వహిస్తోన్న హాన్స్ క్లుగే మీడియాతో మాట్లాడుతూ... మంకీ పాక్స్ వ్యాప్తి నియంత్రణకు, నిర్మూలనకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని సూచించారు. మంకీపాక్స్‌ను కలిసి కట్టుగా ఎదుర్కొంటే నివారించవచ్చని చెప్పారు. మరోసారి నిర్లక్ష్యం చేయకుండా భయం దిశగా వెళ్లకుండా నియంత్రణ చర్యలు తీసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
మంకీ పాక్స్ ఆఫ్రికా దాటి పలు దేశాలకు విస్తరిస్తోంది. కరోనా తర్వాత, మళ్లీ ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లోనూ కొన్ని నగరాల్లో కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం 2022 నుంచి ఇప్పటి వరకు 116 దేశాలకు మంకీపాక్స్ వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 99,176 కేసులు నమోదు అయ్యాయి. కాంగోలో మంకీపాక్స్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇక మన దేశంలో 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. మార్చి 2024లో కేంద్ర ప్రభుత్వం చివరి కేసును గుర్తించింది. ఆ తర్వాత మన దేశంలో ఎలాంటి కేసులూ నమోదు కాలేదు.