విమానం గాల్లో ఉండగా గర్భిణికి పురిటి నొప్పులు.. డాక్టర్‌గా మారిన పైలట్!

వీట్‌జెట్‌ విమానం గాల్లో ఉండగా అందులో ఉన్న ఓ గర్భిణీ ప్రయాణికురాలికి పురిటి నొప్పులు మొదలయ్యాయి.

By Srikanth Gundamalla  Published on  5 March 2024 10:34 AM GMT
pilot,  delivery, pregnant woman,  flight,

 విమానం గాల్లో ఉండగా గర్భిణికి పురిటి నొప్పులు.. డాక్టర్‌గా మారిన పైలట్!

వీట్‌జెట్‌ విమానం గాల్లో ఉండగా అందులో ఉన్న ఓ గర్భిణీ ప్రయాణికురాలికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. అనూహ్యంగా పురిటి నొప్పులు రావడంతో అంతా కంగారుపడ్డారు. అయితే.. విమానంలో ఎవరైనా డాక్టర్‌ ఉన్నారా అని ఆరా తీశారు సిబ్బంది. కానీ అలా ఎవరూ లేకపోవడంతో కంగారు మరింత ఎక్కువైంది. విమానం ల్యాండింగ్‌కు ఇంకా సమయం పడుతుందని తెలిసి.. తల్లీ బిడ్డకు ఏమీ కావొద్దన్న ఉద్దేశంతో విమానం పైలట్‌ డాక్టర్‌గా మారాడు. గర్భిణీకి డెలివరీ చేశాడు. ఈ సంఘటన తైవాన్ నుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న వీట్‌జెట్‌ విమానంలో జరిగింది.

తైవాన్‌ నుంచి టేకాఫ్‌ తీసుకున్న విమానంలో గర్భిణి ఉంది. అయితే.. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే అసౌకర్యంగా అనిపించింది. దాంతో.. బాత్‌రూమ్‌కి వెళ్లింది. అక్కడే ఆమెకు పురిటి నొప్పులు మొదలు అయ్యాయి. ఆమె పురిటి నొప్పులతో బాధపడుతున్న విషయాన్ని విమాన సిబ్బంది గమనించారు. దాంతో.. విమానంలో ఎవరైనా వైద్యుడు ఉన్నారేమో అని వెతికారు. కానీ.. ఫలితం దక్కకపోవడంతో వెంటనే ఈ విషయాన్ని పైలట్‌కు చెప్పారు. విమానం దగ్గర్లో ఉన్న ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాలని చెప్పారు. అయితే.. విమానం ల్యాండింగ్‌కు చాలా సమయం పడుతుందని పైలట్ జాకరిన్‌ తెలిపాడు. పైలట్ జాకరిన్‌ ఎలాగైనా తల్లిబిడ్డలను కాపాడాలని అనుకున్నాడు. వెంటనే కో-పైలట్‌కు బాధ్యతలను అప్పగించాడు. ఇక అక్కడి నుంచి ప్యాసింజర్లు ఉన్న చోటుకి వచ్చాడు. సెల్‌ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించి వారి సూచనలతో పురుడు పోశాడు.

ఇక క్షేమంగా డెలివరీ చేసిన పైలట్‌ జాకరిన్‌ను ప్రయాణికులంతా ప్రశంసించారు. విమానంలో జన్మించిన ఆ చిన్నారికి సిబ్బంది ముద్దుగా 'స్కై' అని పేరు పెట్టారట. ఇక విమానం ల్యాండ్ అయిన తర్వాత తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని పరీక్షించిన వైద్యులు.. వారికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. జాకరిన్ 18 ఏళ్లుగా పైలట్‌గా ఉన్నాడు. తన కెరియర్‌లో ఇలాంటి అనుభవం ఎదురవ్వడం ఇదే తొలిసారి అని చెప్పాడు.

Next Story