ఆ దేశంలో తిండికి లేక ఎంత మంది అల్లాడుతూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధినేత పెట్టడు.. ప్రపంచ దేశాల నుండి సహాయం అడగడు. కేవలం ఆంక్షలను ఎదుర్కోవడంలోనే అక్కడి ప్రజల జీవితాలు పూర్తీ అవుతున్నాయి. ఉత్తర కొరియాలో ఎంతో దారుణ పరిస్థితులు ఉన్నాయని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఎవరు ఏమైనా కానీ తాను మాత్రం తగ్గేదే లేదని కిమ్ జోంగ్ ఉన్ తీరు చూస్తుంటే అందరికీ అర్థం అవ్వకమానదు. తాజాగా ఉత్తర కొరియా సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచడంతోపాటు కోవిడ్-19 నిరోధక చర్యలను కొనసాగిస్తామని కిమ్ జోంగ్ ఉన్ చెప్పాడు. ఇటీవల జరిగిన ఓ రాజకీయ సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉత్తర కొరియా దేశ భద్రత కోసం ప్రణాళికలను పటిష్టపరచుకోవడం తప్పనిసరి అయిందని కిమ్ చెప్పాడట. అత్యంత శక్తిమంతమైన ఆధునిక ఆయుధ వ్యవస్థలను ఉత్పత్తి చేయాలని కిమ్ ఆదేశించాడు. కిమ్ జోంగ్ ఉన్‌కు అమెరికా, దక్షిణ కొరియాలతో చర్చలు జరపాలనే ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఉత్తర కొరియా సరిహద్దులను మూసేసే పరిస్థితి కనిపిస్తున్నట్లు తెలిపారు.