2025 వరకూ తక్కువగా తినాల్సిందే.. కిమ్ ప్రజలకు అల్టిమేటం

North Korea food crisis Kim Jong UN asks citizens to eat less.కిమ్ జాంగ్ ఉన్.. ఉత్తర కొరియా ప్రజలను ఎంతగా ఇబ్బంది

By M.S.R  Published on  28 Oct 2021 1:46 PM GMT
2025 వరకూ తక్కువగా తినాల్సిందే.. కిమ్ ప్రజలకు అల్టిమేటం

కిమ్ జాంగ్ ఉన్.. ఉత్తర కొరియా ప్రజలను ఎంతగా ఇబ్బంది పెట్టాలో పెడుతూనే ఉన్నాడు. ప్రపంచ దేశాలతో కొంత మంచిగా మసలుకుంటే ఏదో ఒక విధమైన సహాయం అందుతుంది. కానీ కిమ్ కు ఉన్న ఈగో అలా చేయనివ్వదు. ఉత్త‌ర కొరియాలో మాన‌వ‌హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతోంద‌ని.. అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర‌మైన ఆక‌లి, పేద‌రికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఐరాస మాన‌వ‌హ‌క్కుల విభాగం చెప్పింది. అయితే ఈ నివేదిక‌పై కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. త‌మ దేశంలోని వాస్త‌వ పరిస్థితులు, ప్ర‌జ‌ల జీవ‌న విధానం తెలియ‌కుండా నివేదిక‌లు త‌యారు చేస్తున్నార‌ని అన్నారు. తాము ఈ నివేదిక‌ను గుర్తించ‌డం లేద‌ని కిమ్ తెలిపారు.

ఈ విష‌యాన్ని ఉత్త‌ర కొరియా అధికార మీడియా సెంట్ర‌ల్ కొరియ‌న్ న్యూస్ ఏజెన్సీ తెలియ‌జేసింది. తమ దేశంలోని పౌరుల భ‌ద్ర‌త‌, ఆరోగ్యానికి సంబంధించి తామే పూర్తి బాధ్య‌త వ‌హిస్తామ‌ని, త‌మ గురించి ఆందోళ‌న చెందాల‌ని ఎవ‌రినీ అడ‌గ‌డం లేద‌ని ఉత్త‌ర కొరియా తెలియ‌జేసింది. ప్ర‌పంచం మొత్తం క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొంటున్న స‌మ‌యంలో ఉత్త‌ర కొరియా దేశ స‌రిహ‌ద్దుల‌ను పూర్తిగా మూసివేసింది. దేశంలో క‌ఠిన‌మైన లాక్ డౌన్ వంటివి విధించింది. దేశంలో ఆహారం కొర‌త తీవ్ర‌స్థాయికి చేరుకున్న‌ది. దేశీయంగా ఉత్ప‌త్తి చేస్తున్నప్పటికీ త‌గినంత‌గా లేక‌పోవ‌డంతో కొర‌త పెరిగిపోతున్న‌ది. దేశ ర‌క్ష‌ణ‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌, ఆహార ఉత్ప‌త్తికి ఇవ్వ‌లేద‌ని ప్ర‌పంచ దేశాలు ఆరోపిస్తున్నాయి.

ఇక తాజాగా కిమ్ తన ప్రజలకు ఎవరూ ఊహించని సలహా ఇచ్చారు. 2025 వ‌ర‌కు ప్ర‌జ‌లు త‌క్కువ‌గా ఆహారం తీసుకోవాల‌ని, చైనాతో స‌రిహ‌ద్దులు ఓపెన్ కావ‌డానికి మ‌రో మూడేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని, అప్ప‌టి వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కిమ్ సూచించారు. దేశంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉత్తర కొరియాలో సరైన ఆహార సరఫరా లేకపోవడం, దేశంలో నివసించే ప్రజల డిమాండ్‌ను తీర్చలేకపోవడమే ప్రస్తుతం దేశంలో ఆహార ధరలు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం. ప్రకృతి వైపరీత్యాలు మరియు బలహీనమైన స్థితిస్థాపకత, తగినంత వ్యవసాయ పదార్థాలు మరియు తక్కువ స్థాయి యాంత్రీకరణ ఈ ఆహార కొరతకు కారణమని నివేదికలు సూచిస్తున్నాయి.

Next Story