కిమ్ సంచలనం.. వరదలను అంచనా వేయలేదని 30మంది అధికారులకు ఉరిశిక్ష
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి అందరికీ తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 4 Sep 2024 5:15 AMఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన తీసుకునే కఠిన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడతారు. ఆయన నియంతలా వ్యవహరిస్తారు. ప్రపంచ దేశాలకు ఈ విషయం తెలుసు. అందుకే కిమ్‌కు నియంత పెట్టిన పేరు అంటుంటారు. అయితే.. ఇటీవల ఉత్తర కొరియాలో భారీ వరదలు సంభవించాయి. పంట పొలాలు, ఇళ్లు వరద నీటిలో మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. అంతేకాదు 4వేల మంది చనిపోయారు కూడా. స్వయంగా కిమ్ వరద ప్రాంతాల్లో కూడా పర్యటించారు. తాజాగా ఈ విషయంలో కిమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తర కొరియాలో వరదలను అడ్డుకోవడం, ప్రాణనష్టాన్ని అడ్డుకోవడంలో విఫలం అయ్యారని అధికారులపై కఠిన నిర్ణయం తీసుకున్నారు కిమ్. 30 అధికారులకు ఉరి శిక్ష విధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వివరాలను అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇటీవల చాగంగ్ ప్రావిన్స్‌లో వరదలు వచ్చి వేల మంది చనిపోయారు. ఇళ్లు వరదలో కొట్టుకుపోవడంతో చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయిన అధికారులకు మరణ దండన విధిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అంతమందికి ఉరి శిక్ష విధించడంతో ఉత్తర కొరియాపై విమర్శలు వస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర కొరియా అధికారులు వెల్లడించారు. కానీ.. ఉరి శిక్ష ఎవరికి అమలు చేస్తున్నారనేది తెలియలేదు.