బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నాయకత్వం
బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 7 Aug 2024 8:30 AM ISTబంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నాయకత్వం
బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ ఎంపికయ్యారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆయనను తాత్కాలిక ప్రభుత్వ నాయకుడిగా చేయాలనే విద్యార్థుల ప్రతిపాదనకు సమావేశంలో ఆమోదం లభించింది. ఈ సమావేశానికి కోటా ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న విద్యార్థులు, త్రివిధ దళాల అధిపతి పాల్గొన్నారు. సమావేశం అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. యూనస్ నేతృత్వంలో త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వారు మధ్యంతర ప్రభుత్వంలో భాగంగా 10-14 మంది ప్రముఖ వ్యక్తులతో సహా పేర్ల జాబితాను సమర్పించారు.
యూనస్‌పై హసీనా ప్రభుత్వం 190కి పైగా కేసుల్లో అభియోగాలు మోపింది. అంతేకాదు.. గతంలో షేక్ హసీనా ప్రభుత్వంతో అనేక గొడవలు జరిగాయి. చట్టబద్ధమైన పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు దాటిందనే కారణంతో గ్రామీణ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అతనిని బలవంతంగా తొలగించారు. దేశంలో నిరసనలకు నాయకత్వం వహించిన విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని గతంలో డైలీ స్టార్ నివేదిక పేర్కొంది. 1940లో చిట్టగాంగ్‌లో జన్మించారు మహమ్మద్ యూనస్. వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించడానికి యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లారు. అంతకుముందు ముందు ఢాకా విశ్వవిద్యాలయంలో కూడా విద్యనభ్యసించారు.