ఇప్పటికీ ఎయిర్‌పోర్టులు లేని దేశాలున్నాయ్.. ఆ దేశాలు ఇవే

యిర్‌పోర్టుల్లేని ఈ దేశాలు అన్నీ యూరప్‌ ఖండంలోనే ఉన్నాయి. ఎయిర్‌పోర్టుల్లేని దేశాలేవో ఓ సారి చూద్దాం.

By Srikanth Gundamalla  Published on  24 Jun 2023 4:57 PM IST
No Airports, europe Countries, Flights

ఇప్పటికీ ఎయిర్‌పోర్టులు లేని దేశాలున్నాయ్.. ఆ దేశాలు ఇవే 

దేశాల మధ్య ప్రయాణాలు చేయాలంటే విమానాల్లో వెళ్లాలి. ఇప్పుడు ఎన్నో విమానయాన సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. దేశాల మధ్య నిత్యం రాకపోకలు జరుపుతుంటాయి. అయితే.. విమానాలు దిగాలంటే ఎయిర్‌పోర్టు కచ్చితంగా ఉండాలి. కానీ.. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఎయిర్‌పోర్టులు లేవు. దీంతో ఆయా దేశాలకు విమాన రవాణా సౌకర్యమే లేదు. అవును నిజమే.. ఎయిర్‌పోర్టుల్లేని ఈ దేశాలు అన్నీ యూరప్‌ ఖండంలోనే ఉన్నాయి. ఎయిర్‌పోర్టుల్లేని దేశాలేవో ఓ సారి చూద్దాం.

ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశం వాటికన్ సిటీ. దీని చుట్టూ ఇటలీ దేశం వ్యాపించి ఉంది. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా అధినేత ఎవరూ లేరు. క్రైస్తవ మత గురువు పోప్ దేశ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. వెయ్యి లోపు జనాభా ఉన్న ఈ వాటికన్‌ సిటీకి ఎయిర్‌పోర్టు లేదు. వాటికన్‌ సిటీకి వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దూరంలో రోమ్‌లో ఉన్న సియాంపినో ఎయిర్‌పోర్టు, ఫిమిసినో విమానాశ్రయాలకు వెళ్లాల్సిందే. అక్కడ నుంచి రోడ్డు మార్గాన వాటికన్‌ సిటీకి వెళ్లాలి.

ఎయిర్‌పోర్టు లేని మరో చిన్న దేశం అండొర్రా. ఫ్రాన్ స్‌, స్పెయిన్‌ దేశాల మధ్యలో ఉంటుంది ఈ దేశం. లోయలు, ప్రకృతి అందాలతో ఎంతో రమణీయంగా ఉంటుంది ఈ దేశమంతా. ఇక్కడ 1982లో ఒక ఎయిర్‌ఫీల్డ్‌ ఏర్పాటు అయ్యింది. 2008 వరకు ప్రైవేట్‌ విమానాలనే ఇక్కడికి అనుమతిచ్చే వారు. తర్వాత మూతపడింది. 2010లో మళ్లీ రీఓపెన్ అయ్యింది. ఎయిర్‌ఫీల్డ్‌లోకి 2015 నుంచి చార్టెడ్‌ విమానాలను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఇప్పుడు ప్రయాణికులు అండొర్రాకు వెళ్లాలంటే ఫ్రాన్స్‌ లేదంటే స్పెయిన్‌ ఎయిర్‌పోర్టుల్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అండొర్రాకు వెళ్లాలి. రోడ్డు మార్గం ప్రయాణానికి 3 గంటల వరకు సమయం పడుతుంది.

ఎయిర్‌పోర్టు లేని మరో చిన్న దేశం శాన్‌ మారినో. ఇటలీని ఆనుకుని శాన్‌ మారినో దేశం ఉంటుంది. ఇక్కడ దాదాపు 40వేల మంది ప్రజలు మాత్రమే ఉంటారు. విమానాల్లో వచ్చే ప్రయాణికులు ఇటలీలోని రిమిని, బొలొగ్నా నగరాల్లో ఎయిర్‌పోర్టుల్లో దిగాల్సి ఉంటుంది. అక్కడ నుంచి రోడ్డు మార్గాన శాన్‌ మారినోకు వెళ్లాలి. శాన్‌ మారినోలో రెండు హెలీప్యాడ్‌లు మాత్రం ఉన్నాయి.

విమాన ప్రయాణ సదుపాయం లేని మరో చిన్న దేశం మొనాకో. ఈ దేశానికి మూడు దిక్కులూ ఫ్రాన్స్‌ ఉంటుంది. మరో వైపు మధ్యధారా సముద్రం ఉంటుంది. మొనాకో దేశంలో 40వేల మంది జనాభా ఉంటారు. టెక్నాలజీలో ప్రపంచం దూసుకుపోతున్నా.. ఈ దేశానికి కూడా ఇప్పటికీ ఎయిర్‌పోర్టు లేదు. ఫ్రాన్స్‌లోని నైస్‌కొట్‌ డిఅజుర్‌ ఎయిర్‌పోర్టు.. ఈ దేశానికి దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మొనాకో వెళ్తారు.

ఎయిర్‌పోర్టు లేని అతిచిన్న దేశం లిచెన్‌స్టైన్‌. ఇది ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌ మధ్యలో ఉంది. లిచెన్‌స్టైన్‌కు పర్యాటకంగా ఎంతో పేరుంది. చాలా మంది ఇక్కడికి వెళ్తున్నా.. ఎయిర్‌పోర్టు మాత్రం అందుబాటులో లేదు. పొరుగు దేశాలైన స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియాలోని ఎయిర్‌పోర్టుల్లో దిగి.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన.. లేదంటే రైలు మార్గాలను ఉపయోగించి లిచెన్‌స్టైన్‌ వెళ్లాలి.

Next Story