నైజీరియాలో స్కూల్ భవనం కూలి 22 మంది విద్యార్థులు మృతి
నైజీరియాలో హఠాత్తుగా రెండంతస్తుల పాఠశాల భవనం కుప్పకూలింది
By Srikanth Gundamalla
నైజీరియాలో స్కూల్ భవనం కూలి 22 మంది విద్యార్థులు మృతి
నైజీరియాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఉత్తర మధ్య నైజీరియాలో హఠాత్తుగా రెండంతస్తుల పాఠశాల భవనం కుప్పకూలింది. తరగతులు జరుగుతున్న సమయంలోనే భవనం కూలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ దుర్ఘటనలో 22 మంది విద్యార్థులు మృతి చెందారు. మరో 100కు పైగా విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలిసింది. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
బుసా బుజి కమ్యూనిటీలోని సెయింట్స్ అకాడమీ కాలేజీలో తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికే పాఠశాల భవనం కుప్పకూలింది. ప్రమాదం బారినపడిన వారిలో 15 ఏళ్లలోపు విద్యార్థులు ఉన్నారు. శిథిలాల్లో మొత్తం 154 మంది విద్యార్థులు చిక్కుకుపోయారని, 132 మందిని రక్షించామని పోలీసు అధికార ప్రతినిధి ఆల్ఫ్రెడ్ అలబో తెలిపారు. గాయపడ్డ విద్యార్థులను ఆస్పత్రులకు తరలించామనీ.. వారు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ప్రమాదంలో 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు.
భవనం కుప్పకూలిన వెంటనే నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అక్కడకు చేరుకుని సహాయక చర్యలను చేపట్టింది. పాఠశాల నిర్మాణం బలహీనంగా ఉండడం, నది ఒడ్డున ఉండడం వల్లే ఈ ఘటన జరిగివుంటుందని అధికారులు అంటున్నారు. ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో భవనాలు తరచూ కూలిపోతుండటం గమనార్హం. గత రెండేళ్లలో ఇలాంటి పలు ఘటనలు నమోదయ్యాయి.