డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ న్యూజిలాండ్ మంత్రి..పదవి కోల్పోయి..

న్యూజిలాండ్‌ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్‌ మద్యం సేవించి కారుని నడిపారు.

By Srikanth Gundamalla  Published on  24 July 2023 7:11 AM GMT
New Zealand, minister, drunk driving, crash,

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ న్యూజిలాండ్ మంత్రి..పదవి కోల్పోయి..

మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ప్రభుత్వాలు, పోలీసులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఇలా చేయడం ద్వారా ఎన్నో రోడ్డుప్రమాదాలు సంభవించాయి. చాలా మంద్రి ప్రాణాలు కోల్పుతున్నారు. ఈక్రమంలో ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. కానీ కొందరు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా న్యూజిలాండ్‌ దేశానికి చెందిన ఓ మంత్రి మద్యం సేవించి నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేశారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. అరెస్ట్‌ చేయడంతో తన పదవికి రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది

న్యూజిలాండ్‌ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్‌ ఆదివారం రాత్రి మద్యం సేవించి కారుని నడిపారు. దాంతో మద్యం మత్తులో ఏం చేస్తున్నారో సరిగా తెలియక.. పార్కింగ్‌లోనే కారుని అతివేగంగా ఢీకొట్టారు.ఈ సంఘటనతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమెను పరీక్షించి చూడగా మంత్రిగా గుర్తించారు. అంతేకాదు.. ఆమె మద్యం మత్తులో ఉన్న విషయం అర్థమైంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. దానికి ఆమె సహకరించలేదు. ఎలాగోలా చివరకు కిరి అలెన్‌ను పోలీసులు పోలీస్‌ స్టేషన్‌ను తరలించారు. గంటల పాటు మంత్రిని పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు. కేసు నమోదు చేయగా.. తాజాగా మంత్రి కిరి అలెన్ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. డ్రంక్ అండ్‌ డ్రైవ్‌లో మహిళా మంత్రి పట్టుబడ్డారనే విషయం దేశ వ్యాప్తంగా సంచలనగా మారింది. కేసు నమోదు కావడం.. కోర్టుకు హాజరుకావాల్సి ఉండటం.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ గురించి దేశం మొత్తం తెలియడంతో కిరి అలెన్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇక డ్రంక్ అండ్‌ డ్రైవ్‌లో మంత్రి పట్టుబడటంపై న్యూజిలాండ్ ప్రధాని క్రిస్‌ హిప్కిన్స్‌ మాట్లాడారు. ఆమెకు మానసిక సమస్యలు ఉన్నట్లు తెలిపారు. మంత్రిగా విధులు నిర్వర్తించేందుకు ఆమె ఫిట్‌గా లేరని వివరించారు. అంతేకాక న్యాయశాఖ మంత్రి క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం సహించరానిదని క్రిస్‌ హిప్కిన్స్‌ చెప్పారు. రాజీనామా చేసేందుకు కిరి అలెన్ అంగీకరించారని.. కానీ ఆమె పార్లమెంట్‌ సభ్యురాలిగా మాత్రం కొనసాగుతుందని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్‌ హిప్కిన్స్‌ తెలిపారు.

కిరి అలెన్‌ రాజకీయ జీవితంలో వేగంగా ఎదిగారు. కానీ..ఇటీవల ఆమె తన జీవిత భాగస్వామి నుంచి విడిపోయారు. అప్పట్నుంచి డిస్టర్బ్ అయినట్లు తెలుస్తోంది. తీరులో మార్పులు గమనించామని ఆమెతో పనిచేస్తోన్న అధికారులు కూడా చెబతున్నారు. కిరి అలెన్ ఎంతో ప్రతిభావంతురాలని.. ఆమె ఇలాంటి పరిస్థితుల్లో చూడటం ఎంతో బాధగా ఉందని చెప్పారు న్యూజిలాండ్ ప్రధాని. త్వరగా ఆమె కోలుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా హిప్కిన్స్ మంత్రి వర్గంలో పదవి కోల్పోయిన నాలుగో మంత్రి కిరి అలెన్. మూడు నెలల్లో న్యూజిలాండ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజీనామాలు.. తొలగింపులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.


Next Story