మరోసారి కోవిడ్ కలవరం.. సింగపూర్‌లో 25వేలకు పైగా కేసులు

కోవిడ్‌ వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది.

By Srikanth Gundamalla
Published on : 19 May 2024 8:39 AM IST

covid wave,  singapore, 25 thousand cases,

 మరోసారి కోవిడ్ కలవరం.. సింగపూర్‌లో 25వేలకు పైగా కేసులు

కోవిడ్‌ వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది. అంతేకాదు.. అన్నింటినీ షట్‌డౌన్ చేయడం వల్ల ప్రపంచ దేశాలు ఆర్థికంగా చాలా వెనుకబడిపోయాయి. అయితే.. కొంతకాలం నుంచి కోవిడ్‌ వైరస్ బెడద తప్పింది అనుకున్న సమయంలోనే.. మరోసారి ఈ వైరస్‌ కలవరపెడుతోంది. తాజాగా కోవిడ్‌-19 కొత్త స్రెయిన్‌ సింగపూర్‌లో కలకలం సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే ఆ దేశంలో 25వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన చేశారు.

సింగపూర్‌లో మే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దాదాపు 25,900 కేసులు నమోదు అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమలోనే దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అసవరం ఉందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కోవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. బయట తిరుగుతున్న సందర్భాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్‌ను కచ్చితంగా ధరించాలనీ.. అలాగే ఇతర నిబంధనలను పాటించాలని సింగపూర్ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్‌ యే కుంగ్‌ ప్రజలకు సూచించారు.

తాము కోవిడ్‌ కొత్త వేవ్‌ ప్రారంభం దశలో ఉన్నామని మంత్రి ఓంగ్‌ యే కుంగ్‌ చెప్పారు. అయితే.. దేశంలో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని చెప్పారు. రెండు నాలుగు వారాల్లో గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందన్నారు. ఈక్రమంలోనే ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఓంగ్‌ యే కుంగ్‌ తెలిపారు. కోవిడ్‌ మరింత వ్యాప్తి చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపై ఉంటుందన్నారు. ముందు వారంలో 13వేల కేసులు ఉంటే.. ఆ తర్వాత వారంలో ఆ కేసుల సంఖ్య 25వేలకు చేరిందన్నారు. సీరియస్‌గా ఉన్నవారికి చికిత్స అందిస్తామనిచెప్పారు. అయితే.. దేశంలో ప్రస్తుతం ఐసీయూ కేసులు తక్కువగానే ఉన్నాయని చెప్పారు. ఇక 60 ఏళ్లు పైబడిన వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బాధపడుతున్న వారికి ఈ వైరస్‌ త్వరగా సోకి.. ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఓంగ్‌ యే కుంగ్‌ సూచించారు. ఇక మరోవైపు కేసుల పెరుగుదలను ఎదుర్కొనేందుకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్త సిద్ధంగా ఉండాలని ఓంగ్‌ యే కుంగ్‌ చెప్పారు.

Next Story