మంకీపాక్స్ వైరస్‌కు టీకా వచ్చేసింది.. కానీ..
ఆఫ్రికా ఖండంలో ఇటీవల మంకీపాక్స్ వైరస్ విజృంభిస్తోంది
By Srikanth Gundamalla Published on 14 Sep 2024 9:08 AM GMTఆఫ్రికా ఖండంలో ఇటీవల మంకీపాక్స్ వైరస్ విజృంభిస్తోంది. దీని బారినపడిన చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌కు టీకా కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. తాజాగా తొలి టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇస్తూ ఊరట ఇచ్చే కబురు చెప్పంది. మంకీపాక్స్ వైరస్ వ్యాధి నియంత్రణ కోసం డబ్ల్యూహెచ్‌వో తొలిసారిగా ఒక టీకాకు ఆమోదం తెలిపింది. మంకీపాక్స్‌పై పోరులో ఇది కీలక ఘట్టమని తెలిపింది. ఈ మంకీపాక్స్ టీకాను డెన్మార్క్‌కు చెందిన బేవేరియన్ నార్డిక్ అనే సంస్థ తయారు చేసింది. ఎంవీఏ-బీఎన్ మంకీపాక్స్ వ్యాక్సిన్ పేరుతో వచ్చిన ఈ టీకాతో.. మంకీపాక్స్ వ్యాధి నియంత్రణ సాధ్యమే అని చెప్పింది. ప్రస్తుతం ఒకే రకమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పరిమిత సంఖ్యలో ఉత్పత్తి అవుతోంది.
మంకీపాక్స్ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండి.. మరణాలు ఎక్కువగా సంభవించిన ప్రాంతాల్లో వెంటనే ఈ వ్యాక్సిన్‌ను అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది రెండు డోసుల వ్యాక్సిన్. దీన్ని 18ఏళ్లు నిండినవారికే వేయాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. యునిసెఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఈ టీకాను కొని, పంపిణీ చేయవచ్చని తెలిపింది. 18 ఏళ్ల లోపు ఉన్న వారికి ఈ టీకా ఇచ్చేందుకు అనుమతి లేనప్పటికీ.. మంకీపాక్స్ అధికంగా వ్యాప్తి చెందే ప్రాంతాల్లో నివసించే వారికి దీన్ని అందించవచ్చని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.
మంకీపాక్స్ వైరస్ ఎక్కువగా పిల్లల్లోనే విస్తరిస్తోన్న నేపథ్యంలో డబ్లూహెచ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది. గత వారంలో కాంగోలో నమోదైన మంకీపాక్స్ వైరస్ కేసుల్లో 70 శాతం మంది 18 ఏళ్ల లోపు వారే ఉన్నారు. ఇక ఆఫ్రికా ఖండంలో గడిచిన వారంలో 3,160 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 107 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు. బేవేరియన్ నార్డిక్ అనే సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద 8 వారాల వరకు నిల్వ ఉంచవచ్చని వెల్లడించించారు. ఇక ఈ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న వారిని రక్షించడంలో 76 శాతం ప్రభావం చూపుతోందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. రెండోడోస్ తీసుకుంటే 82 శాతం ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించింది