గాలి దుమారానికి కూలిన స్టేజ్‌.. ఐదుగురు దుర్మరణం

ఉన్నట్లుండి వీచే గాలి దుమారం.. వానలు తీవ్ర విషాదాన్ని నింపుతాయి.

By Srikanth Gundamalla  Published on  23 May 2024 9:11 AM GMT
mexico, political party meeting, stage, collapse, five dead,

గాలి దుమారానికి కూలిన స్టేజ్‌.. ఐదుగురు దుర్మరణం 

ఉన్నట్లుండి వీచే గాలి దుమారం.. వానలు తీవ్ర విషాదాన్ని నింపుతాయి. ఇక రాజకీయ పార్టీ సభలు నిర్వహించిన ప్రాంతంలో ఈ గాలిదుమారం బీభత్సం చేస్తే అంతే సంగతులు. తాజాగా మెక్సికోలో ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన సభలో ఇదే జరిగింది. శాన్‌ పెడ్రో గార్జా గార్షియా పట్టణంలో బుధవారం సిటిజన్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే.. ఉన్నట్లుండి అక్కడ గాలి దుమారం రేగింది. దాంతో.. ఈదురు గాలుల తీవ్రతకు స్టేజ్‌ బలహీనపడిపోయి ఒక్కసారిగా కుప్పకూలింది. అంతేకాదు.. భారీ లైటింగ్‌ సెట్‌ కూడా సభకు హాజరు అయిన వారిపై పడిపోయింది. స్టేజ్‌ ఆ తర్వాత లైటింగ్‌ సెట్‌ కూలడంతో జనాలు భయపడిపోయారు. మరోవైపు గాలి దుమారం నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి పారిపోవాలని చూశారు.

భయంతో అందరూ ఒక్కసారిగా పరుగులు తీయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి గాయాలు అయ్యాయి. ఇక గాయపడ్డ వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

గాలి దుమారం వల్ల మీటింగ్‌ నిర్వహిస్తోన్న స్టేజ్‌ ఒక్కసారిగా కూలిపోవడం అందరినీ భయాందోళనకు గురి చేసింది. కాగా.. స్థానిక మీడియా ఈ సభను ప్రత్యక్ష ప్రసారం చేసింది. దాంతో.. ప్రమాదం గురించి వెంటనే అందరికీ తెలిసిపోయింది. వెంటనే వైద్య బృందాలు, సైనిక దళాలు రంగంలోకి దిగాయి. స్టేజి కింద.. లైటింగ్‌ సెట్‌ కింద ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. అలాగే చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. ఈ సంఘటన చోటుచేసుకున్న సమయంలో స్టేజ్‌పై సిటిజెన్స్ మూవ్‌మెంట్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జార్జ్‌ అల్వారెజ్‌ మేనెజ్‌ ఉన్నారు. అయితే.. ఆయన సురక్షితంగా బయటపడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన కూడా స్వయంగా స్పందించి ఎక్స్‌ వేదిక ద్వారా అభినులకు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక ప్రమాద సంఘటన తర్వాత మిగతా ప్రచార కార్యక్రమాలను వాయిదా వేసుకున్టన్లు జార్జ్‌ అల్వారెజ్‌ మేనెజ్‌ వెల్లడించారు.


Next Story