మాల్దీవ్స్ అధ్యక్షుడు మయిజ్జుకి షాక్.. మాలె మేయర్ ఎన్నికల్లో ఓటమి
మాల్దీవుల అంశంపై కొద్దిరోజులగా చర్చ జరుగుతోంది. అక్కడేం జరిగినా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 12:13 PM ISTమాల్దీవ్స్ అధ్యక్షుడు మయిజ్జుకి షాక్.. మాలె మేయర్ ఎన్నికల్లో ఓటమి
మాల్దీవుల అంశంపై కొద్దిరోజులగా చర్చ జరుగుతోంది. అక్కడేం జరిగినా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకి మరో షాక్ ఎదురైంది. మాల్దీవుల రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఘోర ఓటమని చవిచూసింది. మాల్దీవుల అధ్యక్షుడు ఇటీవల చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పరోక్షంగా భారత్‌ను విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ మేయర్ ఎన్నికల్లో ఓడిపోవడం చర్చనీయాంశం అయ్యింది.
మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జు కొద్ది నెలల క్రితమే అధికారం చేపట్టారు. ఇక తాజాగా రాజధాని మాలె మేయర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీఎన్‌సీ ఘోర ఓటమి పాలైంది. భారత్ అనుకూల పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. దాంతో.. మాల్దీవుల అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. భారత్‌తో మాల్దీవుల అధికార పార్టీకి దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారపార్టీ ఓడిపోవడం రాజకీయంగా చర్చనీయాశం అవుతోంది. ఇక మాలె మేయర్ ఎన్నికల్లో గెలిచిన ఎండీపీ పార్టీ.. మేయర్ పదవిని ఆదమ్ అజీమ్ దక్కించుకున్నారు.
Congratulations 👏👏👏@adamazim , New Mayor @MaleCitymv@MDPSecretariat @MDPmediaTeam @MDPYouth pic.twitter.com/5RNIACr3Ci
— Ahmed Sarah - Thimarafushi (@SarahThimara) January 13, 2024
కాగా.. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగకముందు మాలె మేయర్ పదవిలో ముయిజ్జు కొనసాగారు. ఆ స్థానాన్ని తాజాగా ఎండీపీ సొంతం చేసుకోవడంతో అధ్యక్షుడికి ఎదురుదెబ్బ తగిలింది. అజీమ్ గెలుపుని మాల్దీవుల మీడియా భారీ విజయంగా అభివర్ణించింది. ఎండీపీకి ప్రస్తుతం భారత అనుకూల విధానాలను అనుసరించే మాజీ అధ్యక్షుడు మహ్మద్ సోలిహ్ నాయకత్వం వహిస్తున్నారు. భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడు విమర్శలు.. ఆ తర్వాత మాలె మేయర్ ఎన్నికల్లో ఎండీపీ గెలుపుతో ఆ పార్టీకి మున్ముందు కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్ గురించి విమర్శలు చేసిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు.. మాల్దీవులను విమర్శించే హక్కు ఏ దేశానికి లేదన్నారు. తమది చిన్నదేశమే కావొచ్చు.. కానీ అది మీకు మమ్మల్ని అవమానించేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఓ స్వతంత్ర, సార్వభౌమ దేశం తమదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే.. అంతకుముందు ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించడం.. దానిపై మాల్దీవుల మంత్రులు విమర్శలు చేస్తూ మాట్లాడటంతో ఈ వివాదం మొదలైంది.