మాలావీ ఉపాధ్యక్షుడి విమానం గల్లంతు ఘటన విషాదం.. 10 మంది మృతి
వైస్ ప్రెసిడెంట్ సౌలస్ షిలిమాతో పాటు 10 మంది దుర్మరణం చెందినట్లు అధికారిక ప్రకటన చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Jun 2024 8:59 PM ISTమాలావీ ఉపాధ్యక్షుడి విమానం గల్లంతు ఘటన విషాదం.. 10 మంది మృతి
ఆఫ్రికా దేశం మలావీలో ఆ దేశ ఉపాధ్యక్షుడు వెళ్తున్న విమానం గల్లంతు అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సంఘటన విషాదాంతంగా ముగిసింది. విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయినట్లు గుర్తించారు భద్రతాబలగాలు. ఈ ప్రమాదంలో వైస్ ప్రెసిడెంట్ సౌలస్ షిలిమాతో పాటు 10 మంది దుర్మరణం చెందినట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా ప్రకటన చేశారు. గల్లంతైన విమానం శకటాలను గుర్తించామనీ.. అందులో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని నిర్ధారించారు.
కాగా.. మలావీలో ఉపాధ్యక్షుడు సౌలస్‌తో పాటు మరో 9 మందితో సైనిక విమానం జుజుకి బయల్దేరింది. అయితే.. మార్గ మధ్యలోనే రాడార్ నుంచి తప్పిపోయింది. ఎంతసేపటికి గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన సైనికులు, పోలీసులు.. ఇతర సహాయక సిబ్బంది గాలింపు చేపట్టారు. ప్రతికూల వాతావరణం ఉన్న కూడా వందల మంది సైనికులు, పోలీసులు, అటవీ అధికారులతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
ఈ సెర్చ్ ఆపరేషన్‌లో మలావీ సైన్యానికి పొరుగు దేశాలు కూడా సాయం చేశాయి. వారు కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొని గాలింపు చేపట్టారు. అంగోలా దేశ అంతరిక్ష కేంద్రం సహాయాన్ని కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే పర్వతాల్లో విమానం కూలిపోయి.. శకలాలను గుర్తించామని చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన సందర్భంగా తమకు సాయం అందించేందుకు అమెరికా, బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ కూడా ముందుకు వచ్చాయని మలావీ అధ్యక్షుడు చెప్పారు. ఉపాధ్యక్షుడు సౌలస్‌తో పాటు 9 మంది చనిపోవడం దేశాన్ని విషాదంలో నింపిందని ఆయన చెప్పారు.