గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి, 40 మంది మృతి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య సుదీర్ఘ కాలంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది.
By Srikanth Gundamalla Published on 10 Sept 2024 11:30 AM ISTఇజ్రాయెల్, హమాస్ మధ్య సుదీర్ఘ కాలంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాల మధ్య శాంతి కోసం అగ్రరాజ్యాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యంగానే ఉంది. అయితే.. తాజాగా గాజాలోని మానవతా జోన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. మరో 60 మందికి పైగా గాయాలు అయినట్లు తెలిపారు.
అయితే.. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి ముందు గాజాలోని ఖాన్ యూనిస్‌లోని అల్-మవాసీ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం సురక్షిత మానవతా జోన్‌గా గుర్తించింది. దాంతో దాదాపు 10వేల మంది పాలస్తీనియన్లు అక్కడే ఆశ్రయం ఉంటున్నారు. అయినా.. ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో పలుమార్లు దాడులకు తెగబడింది. తాజాగా సోమవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ మానవతా జోన్‌పై వైమానికి దాడులు చేసింది. ఈ దాడుల్లో 40 మంది దుర్మరణం చెందారు. 60 మందిగాయాల పాలు అయ్యారు. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు సివిల్ డిఫెన్స్ అధికారులు చెప్పారు.
వైమానిక దాడులతో చాలా భవనాలు ధ్వంసం అయ్యాయి. కొన్నిచోట్ల కుప్పకూలడంతో శిథిలాలు విరిగిపడ్డాయి. వాటి కిందకొందరు చిక్కుకున్నారని చెప్పారు. దాదాపు 15 మంది శిథిలాల కింద ఉన్నారనీ.. వారిని బయటకు తీసేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇక వైమానిక దాడుల్లో ఆశ్రయం పొందుతున్న 40 కంటే ఎక్కువ టెంట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. జూలైలో ఇదే ప్రాంతంలో దాడి జరగ్గా.. అప్పుడు హమాస్ మిలిటరీ చీఫ్ మొహ్మద్ దీఫ్ సహా 90 మంది చనిపోయారు. కాగా గాజాలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇప్పటివరకు దాదాపు 40,988 మంది మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
మరోవైపు ఈ దాడులపై ఇజ్రాయెల్ దళాలు స్పందించాయి. హమాస్ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకునే దాడులు జరిపినట్లు చెప్పాయి. గాజాలోని పలు ఉగ్రవాద సంస్థలు మనవతా జోన్‌పై దాడులకు పాల్పడుతూ వాటికి ఇజ్రాయెల్ దళాలను బాధ్యులను చేస్తున్నాయని ఫైర్ అయ్యింది.