హెజ్‌బొల్లాకు రెండో ఎదురుదెబ్బ, మరో ముఖ్యనేత హతం
పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 29 Sep 2024 11:13 AM GMTపశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. మొన్నటి వరకు గాజాపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ తాజాగా లెబనాన్‌పై భీకర దాడులకు పాల్పడుతోంది. హిజ్బొల్లాను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో లెబనాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన పౌరులు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. దాడుల్లో ఇప్పటికే హెజ్బొల్లా అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చింది.
ఈ యుద్ధంలో లెబనాన్ తీవ్రవాద సంస్థ హెజ్‌బొల్లాకు వరుసగా రెండో ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా మరో ముఖ్యనేత నబిల్‌కౌక్ మరణించాడు. తమ రాకెట్ దాడుల్లో హెజ్‌బొల్లా డిప్యూటీ హెడ్ నబిల్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే.. ఇజ్రాయెల్ సైన్యం ప్రకటనపై ఇప్పటివరకు హెజ్‌బొల్లా మాత్రం స్పందించలేదు. నస్రల్లాను దాడిలో హత మార్చిన తర్వాత దాన్ని కోలుకోకముందే హెజ్బొల్లా మరో కీలక నేతను కోల్పోయింది. కాగా.. నబిల్ 1995 నుంచి 2010 వరకు సౌత్ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు.