ఇజ్రాయెల్, హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ
చాలా రోజులుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 30 Aug 2024 11:30 AM ISTఇజ్రాయెల్, హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ
ఏడాదిన్నరకు పైగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇరు వర్గాల మధ్య కాల్పులతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ వద్ద ఇప్పటికీ ఇజ్రాయెల్‌కు చెందిన ప్రజలు బంధీగా ఉన్న విషయం తెలిసిందే. కాల్పుల విరమణకు చర్చలకు రావాలని అగ్రదేశాలు స్వాగతిస్తున్నా.. ఇన్నాళ్లు ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా.. కాల్పుల విరమణపై కీలక పరిణామం జరిగింది. తాత్కాలిక కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్ ఇద్దరూ ఒప్పుకున్నారు. మూడ్రోజుల పాటు కాల్పులు జరపకూడదని నిర్ణయం తీసుకున్నాయి.
అయితే.. పిల్లలకు పోలియో టీకాలు అందించేందుకు సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. దాంతో.. తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరు వర్గాలు అంగీకరించాయి. గాజాలోని మూడు వేర్వేరు జోన్లలో మూడు రోజుల పాటు కాల్పులకు దూరంగా ఉంటారని ఈ మేరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా.. మొదటి రౌండ్‌లో 6.40 లక్షల మంది పిల్లలకు పోలియో టీకాలు వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఈ పోలియో టీకాల పంపిణీ కార్యక్రమం మొదలుకానుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలియో టీకా కార్యక్రమం కొనసాగనుందని డబ్ల్యూహెచ్‌వో అధికారి తెలిపారు. మొదటగా మధ్య గాజా, ఆ తర్వాత దక్షిణ గాజా, మూడు రోజుల విరామం తర్వాత ఉత్తర గాజాలో టీకాల కార్యక్రమం కొనసాగనుంది. ఒకవేళ అవసరం అయితే నాలుగో రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాగా.. గాజాలో ఇటీవల టైప్-2 పోలియో వైరస్ కేసు నమోదైంది. చిన్నారి పక్షవాతానికి గురైంనట్లు తెలిపారు అధికారులు. అందుకే పోలియో టీకా కార్యక్రమం చేపడుతున్నారు. గత 25 ఏళ్లలో గాజాలో పోలియే కేసు నమోదు కావడం ఇదే తొలిసారి.