ఇరాన్ అణు శాస్త్రవేత్త దారుణ హత్య
Iranian nuclear scientist murdered .. ఇరాన్ దేశానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త మొహ్సేన్ ఫఖ్రిజాదే దారుణ హత్యకు గుర
By సుభాష్ Published on 28 Nov 2020 9:04 AM GMTఇరాన్ దేశానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త మొహ్సేన్ ఫఖ్రిజాదే దారుణ హత్యకు గురయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో జరిగిన దాడిలో శాస్త్రవేత్త మరణించారు. నగర శివారు ప్రాంతమైన అబ్‌సార్డ్ వద్ద వాహనంలో వెళ్తున్న ఫఖ్రిజాదే పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ హత్యను ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జావాద్ జరీఫ్ ఖండించారు.
హత్య ఎలా జరిగింది?
ఇరాన్ రక్షణ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. "రక్షణ శాఖ పరిశోధన, ఆవిష్కరణల విభాగం అధిపతి మొహ్సేన్ ఫఖ్రిజాదే ప్రయాణిస్తున్న కారును సాయుధులైన తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. తీవ్రవాదులకు ఫఖ్రిజాదే అంగరక్షకులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన్ను రక్షించేందుకు వైద్య బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి" అని తెలిపింది. మొదట పేలుళ్ల శబ్దం వినించిందని, ఆ తర్వాత మెషిన్ గన్లతో కాల్పులు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది. ముగ్గురు నలుగురు తీవ్రవాదులు కూడా హతమయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు ఏజెన్సీ తెలిపింది.
ఇరాన్ రక్షణశాఖకు చెందిన రీసర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అధిపతిగా ఫక్రిజాదే పనిచేశారు. 2010 నుంచి 2012 మధ్య నలుగురు ఇరాన్ అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు ఈ హత్యల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపించింది. ఫఖ్రిజాదే హత్య వార్తలపై ఇజ్రాయెల్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ కూడా దీనిపై స్పందించలేదు.
సీనియన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మృతి పట్ల ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఆ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్‌లో కోవర్ట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లో ఫక్రిజాదేకు ప్రమేయం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే తాము చేపడుతున్న అణు కార్యక్రమం శాంతి కోసమే అంటూ ఇరాన్ ప్రకటించింది.