సముద్రంలో కూలిన విమానం, కూతుళ్లతో పాటు హాలీవుడ్ నటుడు మృతి

హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on  6 Jan 2024 10:08 AM IST
hollywood, actor oliver,   two daughters, death ,

 సముద్రంలో కూలిన విమానం, కూతుళ్లతో పాటు హాలీవుడ్ నటుడు మృతి

హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు ఇద్దరు కూతుళ్లు కూడా చనిపోయారు. వెకేషన్‌లో బాగంగా హాలీవుడ్‌ నటుడు క్రిస్టియన్ ఒలివర్‌ తన కుటుంబంతో కలిసి గ్రెనడైన్స్‌లోని బెక్వియా ద్వీపం నుంచి సెయింట్‌ లూసియాకు బయల్దేరారు. విమానం బెక్వియాలో టేకాఫ్‌ తీసుకుంది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలోనే విమానం కరీబియన్ సముద్రంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలోనే ఒలివర్‌తో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు మడిత, అన్నీక్‌ ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ సంఘటనలో పైలట్‌ కూడా చనిపోయాడని అధికారులు వెల్లడించారు.

విమానం సముద్రంలో కూలిందన్న సమాచారం తెలుసుకున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానం కూలిన ప్రదేశానికి చేరుకున్నారు. కాసేపటికే నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. జర్మనీ సంతతకి చెందిన ఒలివర్ తన కెరియర్‌లో 60కి పైగా సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. ప్రముఖ నటుడు టామ్ క్రూయిజ్‌ నటించిన వాల్కరీ మూవీలో కూడా ఓ చిన్న పాత్రలో కనిపించారు. కాగా.. ఒలివర్‌ వయసు ప్రస్తుతం 51 ఏళ్లు. కెరియర్‌ ఆరభంలో ఒలివర్ సేవ్డ్‌ బై దిబెల్, ది న్యూ క్లాస్, బేబీ సిట్టర్స్‌ క్లబ్‌ సీరియళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పాపులర్ షో అలారమ్ ఫర్ కోబ్రా-11లో ఒలివర్ రెండు సీజన్లలో నటించారు. హాలీవుడ్‌ నటుడు ఇద్దరు కూతళ్లతో పాటు చనిపోయినట్లు సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీన్స్‌ పోలీసులు ప్రకటనలో వెల్లడించారు. క్రిస్టియన్ ఒలివర్ తన ఇద్దరు కూతళ్లతో పాటు చనిపోవడంతో విషాద చాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు వీరి మరణం పట్ల సంతాపం తెలుపుతున్నారు.


Next Story