హమాస్ మరో వీడియో.. విడిపించండి ప్లీజ్‌ అంటోన్న యువతి

హమాస్ విడుదల చేసిన వీడియోపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) స్పందించింది.

By Srikanth Gundamalla  Published on  17 Oct 2023 6:58 AM GMT
hamas militants,  new video,  israeli hostage,

హమాస్ మరో వీడియో.. విడిపించండి ప్లీజ్‌ అంటోన్న యువతి 

పదిరోజులుగా పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్ – ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకరపోరు కొనసాగుతోంది. గాజాలో పాగా వేసిన హమాస్‌ మిలిటెంట్లను హతమార్చేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు చేస్తోంది. దాంతో.. ఇజ్రాయెల్‌ దాడుల నుంచి తప్పించుకునేందుకు ఆ దేశ పౌరులను బంధీగా చేసుకున్నారు హమాస్‌ మిలిటెంట్లు. తమ వద్ద ఇజ్రాయెల్‌ పౌరులు దాదాపు 199 మంది బందీగా ఉన్నారని ప్రకటించారు. అందులో చిన్నారులు , మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారని చెప్పారు. అయితే.. బందీలకు సంబంధించిన వీడియో ఒకటి హమాస్‌ మిలిటెంట్లు విడుదల చేశారు. అందులో యువతి చేతికి తగిలిన గాయంతో బాధపడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హమాస్ విడుదల చేసిన వీడియోలో కనిపించే యువతి పేరు మియా షెమ్. ఈమెకు 21ఏళ్లు. ప్రస్తుతానికి తాను బాగానే ఉన్నానని చెప్పిన ఆ యువతి.. వీలైంనంత త్వరగా తనను ఇక్కడి నుంచి విడిపించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని వేడుకుంది. కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడుతూ కనిపించింది. అయితే.. తాను ప్రస్తుతం గాజాలో ఉన్నానని.. అక్టోబర్ 7న హమాస్ దాడి సమయంలో తాను రీమ్‌ కిబుట్జ్‌లో జరిగిన సూపర్ నోవా మ్యూజిక్ పార్టీలో పాల్గొన్నట్లు వెల్లడించింది. ఆ సమయంలో తన చేతికి గాయమైనట్లు వెల్లడించింది. అయితే.. ఆ గాయానికి గాజాలో దాదాపు మూడు గంటల పాటు సర్జరీ జరిగిందని చెప్పింది. కాగా.. వాళ్లు బాగానే చూసుకుంటున్నారని.. అవసరమైన మందులు అందిస్తున్నారని చెప్పింది మియా. కానీ.. తనని వీలైనంత త్వరగా హమాస్ మిలిటెంట్ల నుంచి విడిపించాలని.. అమ్మానాన్నల వద్దకు తీసుకెళ్లాలని ప్రభుత్వానికి విన్నవించుకుంది.

ఈ వీడియోను హమాస్‌ మిలిటెంట్లు తమ సొంత టెలిగ్రామ్‌లో విడుదల చేయగా.. ఆ తర్వాత ఆ సంస్థ మద్దతుదారులు కొందరు ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉండగా.. మియా కిడ్నాప్‌ను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ కూడా ధ్రువీకరించింది. మియా కుటుంబాన్ని సంప్రదించి.. ఆమె హమాస్‌ చెరలో ఉన్నట్లు చెప్పామని తెలిపింది. మియాతో పాటు హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారందరినీ విడిపించేందుకు మేం అన్ని విధాల ప్రయత్నిస్తున్నామని ఐడీఎఫ్ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. ఇంతకుముందు కూడా హమాస్ మిలిటెంట్లు ఇలాంటి వీడియోలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Next Story