ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం.. ప్రతిదాడి చేస్తోన్న సైన్యం
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తలు మరోసారి భగ్గుమన్నాయి.
By Srikanth Gundamalla Published on 7 Oct 2023 1:15 PM ISTఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం.. ప్రతిదాడి చేస్తోన్న సైన్యం
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తలు మరోసారి భగ్గుమన్నాయి. ఇజ్రాయెల్‌లోని అనేక నివాస ప్రాంతాలపై గాజా వైపు నుంచి రాకెట్లు ప్రయోగించారు. హమాస్ (పాలస్తీనా మిలిటెంట్లు) ఈ దాడులకు పాల్పడింది. దాంతో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. అంతేకాదు.. పాలస్తీనాకు చెందిన మిలిటెంట్లు కూడా తమ భూభాగాల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం గురించింది. దాంతో ఆ దేశ సైనికులు అప్రమత్తం అయ్యారు. ప్రజలను అప్రమత్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత పాలస్తీనా దాడులకు దీటుగా ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులకు దిగింది.
పాలస్తీనా మిలిటెంట్ల దాడులు, చొరబాట్లతో జెరూసలెం, టెల్ అవివ్ సహా దేశవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యధిలోనే వేల రాకెట్లను ప్రయోగించారని ఇజ్రాయెల్ సైనికాధికారులు చెబుతున్నారు. అయితే.. ఇజ్రాయెల్‌పై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మహమ్మద్ డెయిఫ్ ప్రకించారు. శనివారం తెల్లవారుజామునే ఆపరేషన్‌ను మొదలుపెట్టినట్లు చెప్పారు. 5వేల రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించామని ఆయన చెప్పినట్లు ఓ సందేశం బయటకు వచ్చింది.
హమాస్ మిలిటెంట్ల దాడులపై అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం వారిని ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకుంది. గాజా స్ట్రిప్‌లోని హమాస్ స్థావరాలపై ప్రతిదాడులు చేసినట్లు వెల్లడించింది. మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లను కూడా కూల్చేందుకు యాంటీ రాకెట్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు తెలిపింది. అయితే.. పేలుడు శబ్ధాలు భారీగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించినట్లు అయ్యింది. ఇజ్రాయెల్‌లోకి చొచ్చుకువచ్చిన హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతోంది. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా చెబుతున్నాయి.