విమానంలో సాంకేతిక లోపం..సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఫ్రాన్స్‌లో ఓ పర్యాటక విమానం పైలట్ ఏకంగా సముద్రంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.
By Srikanth Gundamalla Published on 31 July 2023 1:31 PM ISTవిమానంలో సాంకేతిక లోపం..సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాధారణంగా విమానం టేకాఫ్‌కు ముందే అన్నింటిని పరిశీలిస్తారు సిబ్బంది. ఇంజిన్‌లో సమస్యలు సహా ఇతరత్రా అన్నింటినీ పర్యవేక్షిస్తారు. అన్ని సరిగ్గా ఉన్నాయని తెలిస్తేనే టేకాఫ్ అవుతుంది. కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల్లో గాల్లో ఉండగా సాంకేతిక లోపం ఏర్పడితే పైలట్లు దగ్గర్లో ఉన్న ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేస్తారు. ఆ తర్వాత లోపాన్ని సరిచేశాక తిరిగి బయల్దేరతారు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి. ఫ్రాన్స్‌లో ఓ పర్యాటక విమానం పైలట్ ఏకంగా సముద్రంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే.. బీచ్ రెస్క్యూ టీమ్ వెంటనే స్పందించడంతో పైలట్ సహా ప్రయాణికులను రక్షించారు.
దక్షిణ ఫ్రాన్స్‌లోని ఫ్రెజుస్ తీరంలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తీరానికి మరో 600 మీటర్ల దూరం ఉందనంగా సెస్నా 177 రకం చిన్నపాటి పర్యాటక విమానం ఇంజిన్‌లో లోపం ఏర్పడింది. విమానంలో పైలట్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడటాన్ని గమనించాడు పైలట్. తీరంలో ల్యాండ్ చేసేందుకు వచ్చాడు.. కానీ అక్కడ జనాలు ఎక్కువగా ఉండటాన్ని గమనించాడు. తీరంలో ల్యాండ్ చేస్తే ప్రమాదమని అనుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో విమానాన్ని సముద్రంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు పైలట్.
విమానం సముద్రంలో ల్యాండ్ అవ్వడాన్ని గమనించారు బీచ్‌లో ఉన్న రెస్క్యూ టీమ్. వెంటనే స్పందించి బోట్లు తీసుకుని ప్రమాదం జరిగిన చోటుకి వెళ్లారు. అప్పటికే విమానం నీళ్లలో మునిగిపోయింది. కానీ.. ప్రయాణికులతో పాటు పైలట్ నీళ్లలో కనిపించారు. దాంతో ముగ్గురినీ బోటులో ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చారు. ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. సదురు పైలట్ సమయస్ఫూర్తితోనే విమానాన్ని సముద్రంలో ల్యాండ్ చేశారని నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం మామూలు విషయం కాదని.. ఎంతో నైపుణ్యం కావాలని అంటున్నారు. అలాగే అదృష్టమూ కలిసి రావాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.