అమెజాన్ అడవుల్లో కుప్పకూలిన విమానం, 14 మంది దుర్మరణం
బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 17 Sept 2023 10:21 AM ISTఅమెజాన్ అడవుల్లో కుప్పకూలిన విమానం, 14 మంది దుర్మరణం
బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బ్రెజిలియన్ అమెజాన్ అడవుల్లో పాపులర్ టూరిస్ట్ టౌన్ బార్సెలోస్‌లో ప్రతికూల వాతావరణంలో ల్యాండింగ్‌కు ప్రయత్నించిన విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు.
బార్సెలోస్ ఉత్తర పట్టణంలోని బ్రెజిలియన్ అమెజాన్‌లో చిన్న విమానం కుప్పకూలింది. 12 మంది ప్రయాణికులు ఫిషింగ్ స్పోర్ట్ కోసం మానౌస్ నుంచి బార్సిలోస్‌కు ఈఎంబీ-110 అనే చిన్న విమానంలో వెళ్తున్నారు. అయితే.. వర్షం కారణంగా విమానాన్ని దించడానికి పైలట్లు ప్రయత్నించారు. చిన్న విమానం ప్రతికూల వాతావరణంలో చిత్తడిగా ఉన్న రన్‌వేపై ల్యాండయ్యింది. రన్‌వే దాటి పొదల్లో దూసుకెళ్లిందని అధికారులు చెబుతున్నారు. మృతుల్లో అమెరికన్ పౌరులు కూడా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 12 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని అధికారి వెల్లడించారు. మృతులంతా పురుషులేనని అధికారులు తెలిపారు. విమానం కుప్పకూలిన మరుక్షణం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అక్కడి గవర్నర్ విల్సన్ లిమా వెల్లడించారు.
కుప్పకూలిన విమానం రెండు ఇంజిన్లతో కూడుకున్నది.. దీనిని బ్రెజిలియన్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారు ఎంబ్రైర్ అనే కంపెనీ తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకని కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చిచెప్పారు.