ఇన్ని రోజులూ కరోనా.. ఇప్పుడు లస్సా ఫీవర్ టెన్షన్
First Death from Lassa Fever in UK.బ్రిటన్ కరోనా కారణంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By M.S.R Published on 16 Feb 2022 12:27 PM ISTబ్రిటన్ కరోనా కారణంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్రిటన్ లో కొత్త జబ్బు కలకలం రేపుతోంది. లస్సా ఫీవర్ ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతూ ఉంది. లస్సా ఫీవర్ బారినపడిన బ్రిటన్ లో ముగ్గురు మరణించారు. బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఈ కొత్త వైరస్ గురించి చెబుతూ, ఇది కూడా మహమ్మారిలా వ్యాపించగలదని అన్నారు. బ్రిటన్ లో 1980లోనే పలు లస్సా ఫీవర్ కేసులు గుర్తించారు. 2009లో రెండు కేసులు వెల్లడయ్యాయి. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ (సీడీసీ) లస్సా ఫీవర్ జంతువుల నుంచి వ్యాపిస్తుందని వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా స్పందించింది. ఈ వైరస్ బారినపడిన ఎలుకలు ఆహార పదార్థాలపై మలమూత్ర విసర్జన చేసినప్పుడు, ఆ ఆహారాన్ని తీసుకున్న మనుషులు లస్సా వైరస్ బారినపడతారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
ఈ వైరస్ ను 1969లో ఆఫ్రికా దేశం నైజీరియాలో మొట్టమొదటిసారిగా గుర్తించారు. ఇది వెలుగు చూసిన పట్టణం ఆధారంగానే దీనికి లస్సా వైరస్ అనే పేరు వచ్చింది. ప్రతి ఏడాది 1 లక్ష నుంచి 3 లక్షల మంది వరకు లస్సా ఫీవర్ బారినపడుతుంటారని, 5 వేల మంది వరకు చనిపోతుంటారని సీడీసీ పేర్కొంది. ఒక్కసారి మానవదేహంలోకి ప్రవేశించాక 2 నుంచి 21 రోజుల వ్యవధిలో విస్తరిస్తుంది. అయితే చాలామందిలో లస్సా ఫీవర్ లక్షణాలు స్వల్పంగానే ఉంటాయని, కొందరిలో అయితే గుర్తించలేమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. తొలుత జ్వరంతో ప్రారంభమై నీరసం వంటి లక్షణాలకు గురవుతారని, ఇన్ఫెక్షన్ ముదిరేకొద్దీ రోగిలో తలనొప్పి, గొంతునొప్పి, కండరాల నొప్పులు, ఛాతీ నొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు, దగ్గు, కడుపు నొప్పి వంటి లక్షణాలకు గురవుతారు. ఈ లస్సా ఫీవర్ తీవ్రస్థాయికి చేరితే ముఖం ఉబ్బరించడం, ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం, కొన్ని అవయవాల నుంచి రక్తస్రావం జరగడం, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఎబోలా, మలేరియా, షిగెలోసిస్, టైఫాయిడ్, యెల్లో ఫీవర్ ల తరహాలోనే దీని లక్షణాలు కూడా ఉంటాయని, దీన్ని ప్రత్యేకంగా గుర్తించడం కష్టమని అభిప్రాయపడింది. లస్సా ఫీవర్ చికిత్సలో ప్రధానంగా రిబావిరిన్ వంటి యాంటీ వైరల్ ఔషధాలతో రోగులకు స్వస్థత చేకూరుతుందని సీడీసీ చెబుతోంది.
ఈ వైరల్ ఫీవర్ తో ప్రజలకు ప్రమాదం "చాలా తక్కువగా ఉంది" అని కొందరు నిపుణులు చెబుతున్నారు. వ్యాధి బారిన పడకుండా ఉండటానికి ఉత్తమ మార్గం ఎలుకలతో కాంటాక్ట్ ను నివారించడం. వ్యాధి వ్యాప్తి చెందుతున్న ప్రదేశాలలో ఎలుకలతో జాగ్రత్తగా ఉండాలి. ఎలుకలు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి, చాలా ప్రాంతాలలో పరిశుభ్రతను పాటించడం వంటివి చేయాలి.