ఇంకొన్నాళ్లు ఇండియాలోనే షేక్ హసీనా.. ఇదే కారణం!
బంగ్లాదేశ్ దేశ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగి దేశం వీడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌లోనే ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 6 Aug 2024 11:34 AM ISTఇంకొన్నాళ్లు ఇండియాలోనే షేక్ హసీనా.. ఇదే కారణం!
రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ మొత్తం అట్టుడుకుతోంది. అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ దేశ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగి దేశం వీడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌లోనే ఉన్నారు. యూకే వెళ్తారని చెబుతున్నా.. మరి కొంత కాలం ఇక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంకొన్నాళ్లు ఇండియాలోనే ఉండేందుకు హసీనాకు భారత ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా బ్రిటన్ వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో ఆమె బంగ్లాదేశ్‌ను వదిలి వచ్చేసింది. ఇండియాలో ఉంది. షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా యూకేలో ఆశ్రయం కోరినట్లు సమాచారం. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో యూకే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేవరకు ఆమె భారత్ లో ఉండేందుకు కేంద్రం తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
హసీనా సోదరి రెహానా యూకే పౌరురాలు. ఆమె కుమార్తె తులిప్ సిద్దిఖీ ప్రస్తుతం లేబర్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం యూకేలో లేబర్ పార్టీనే అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే హసీనా బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం బంగ్లా నుంచి ఢిల్లీ చేరుకున్న హసీనా ఇక్కడి నుంచి భారత్ సహకారంతో లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. హసీనా రాజకీయ శరణార్థిగా యూకే వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆశ్రయం కోసం అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. మరోవైపు, బంగ్లాదేశ్‌లో నెలకొన్న కల్లోల పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది.