ఎలాన్‌ మస్క్‌ స్పేస్ఎక్స్‌ రికార్డు.. తొలిసారిగా ప్రైవేట్‌ స్పేస్‌వాక్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ నేతృత్వంలో అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌ కూడా పని చేస్తోంది.

By Srikanth Gundamalla  Published on  13 Sept 2024 2:32 PM IST
ఎలాన్‌ మస్క్‌ స్పేస్ఎక్స్‌ రికార్డు.. తొలిసారిగా ప్రైవేట్‌ స్పేస్‌వాక్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ నేతృత్వంలో అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌ కూడా పని చేస్తోంది. ఇక్కడ వివిధ ప్రయోగాలు చేపడుతున్నారు. తాజాగా స్పేస్‌ఎక్స్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్‌ స్పేస్‌వాక్‌ను నిర్వహించింది. ‘పొలారిస్‌ డాన్‌’ ప్రాజెక్టు కింద ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా మంగళవారం నలుగురు నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరైన ప్రపంచ ప్రముఖ బిలియనీర్ జేర్డ్‌ ఇస్సాక్‌మన్‌ తొలుత క్యాప్సుల్‌ నుంచి బయటకు వచ్చారు. స్పేస్‌వాక్‌ నిర్వహించారు. సాధారణంగా ఇలాంటివి ప్రొఫెషనల్‌ వ్యోమగాములు చేస్తారు. కానీ.. ప్రొఫెషనల్స్ కాకుండా.. అంతరిక్షంలో స్పేస్‌వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా జేర్డ్ ఇస్సాక్‌మన్ రికార్డు నెలకొల్పారు.

అయితే గత 50 ఏళ్లలో ఇదే అత్యధిక స్పేస్‌వాక్‌ కావడం విశేషమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జేర్డ్ ఇస్సాక్‌మన్ స్పేస్‌వాక్‌ తర్వాత స్పేస్‌ఎక్స్‌ ఇంజినీర్‌ సారా గిల్లిస్‌ కూడా ఆయన్ని అనుసరించారు. ఈ స్పేస్‌వాక్‌ దాదాపు 1400 కిలోమీటర్ల ఎత్తులో చేశారు. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉన్న ఎత్తు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాగా.. స్పేస్‌ఎక్స్ పొలారిస్ డాన్ మిషన్ మంగళవారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ప్రారంభించారు. స్పేస్‌ఎక్స్ సహకారంతో ఇస్సాక్‌మన్‌ ఈ అత్యంత సాహసోపేతమైన పనిని భూమికి వందల మైళ్ల దూరంలో నిర్వహించారు. ప్రపంచంలోని మొట్టమొదటి ప్రైవేట్‌ స్పేస్‌వాక్‌ కొత్త సాంకేతికతను పరీక్షించింది. ఇస్సాక్‌మన్ తో పాటు ఆయన బృందం హాచ్ తెరవడానికి ముందు వారి క్యాప్సూల్‌లో ఒత్తిడి తగ్గడం కోసం చాలా సేపు వెయిట్ చేశారు. వాక్యూమ్ నుండి తమను తాము రక్షించుకోవడానికి SpaceX కొత్త స్పేస్‌వాకింగ్ సూట్‌లను ధరించారు. ఈ స్పేస్‌వాకింగ్ పరీక్ష సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్పేస్‌ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది.

Next Story