రోహింగ్యాలపై డ్రోన్ దాడి... వంద మందికిపైగా మృతి..!
బంగ్లాదేశ్‌లో కొన్నాళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 11 Aug 2024 11:50 AM ISTరోహింగ్యాలపై డ్రోన్ దాడి... వంద మందికిపైగా మృతి..!
బంగ్లాదేశ్‌లో కొన్నాళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రిజర్వేషన్ల కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. అయితే.. ఈ దేశం ముందు మరో సవాల్ నిలిచింది. తాజాగా మయన్ఆర్ నుంచి పెద్ద సంఖ్యలో రోహింగ్యా ముస్లింలు ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మయన్మార్ నుంచి బంగ్లాదేశ్‌లోకి పెద్ద ఎత్తున ముస్లింలు వస్తున్నారు. ఈ క్రమంలోనే తరలివస్తోన్న రోహింగ్యా ముస్లింలపై డ్రోన్ దాడి జరిగింది. ఈ సంఘటనలో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ సంఖ్యలో మహిళలు, చిన్నారులే ఉన్నారని సమాచారం. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో.. ఈ ఉదంతం సంచలనంగా మారింది. బురదతో కూడిన పొలంలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ మృతదేహాల చుట్టూ సూట్‌కేసులు, బ్యాక్‌ప్యాక్‌లు ఉన్నాయి.
వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు ప్రత్యక్ష సాక్షులు ఈ డ్రోన్ దాడుల గురించి మీడియాకు తెలిపారు. బంగ్లాదేశ్ సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్న కుటుంబాలపై ఈ దాడి జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ దాడి రోహింగ్యా పౌరులపై జరిగిన అత్యంత పాశవిక దాడిగా పేర్కొన్నారు. ఈ దాడుల వెనుక అరకాన్ ఆర్మీ హస్తం ఉందని చెబుతున్నారు. అయితే.. ఈ ఆరోపణలను అరకాన్ ఆర్మీ ఖండించింది. ఈ దాడిపై మయన్మార్, మిలీషియా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. మరి ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఎప్పటివి..? నిజంగా ఇటీవల జరిగిన దాడేనా? లేదంటే పాత విజువల్సా? అనేది తెలియాల్సి ఉంది.