కాంగోలో ఘోరం.. జైల్లో 129 మంది ఖైదీలు మృతి

డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్ కాంగోలోని సెంట్రల్‌ మకాల జైలులో ఘోరం జరిగింది.

By Srikanth Gundamalla  Published on  3 Sep 2024 6:12 AM GMT
కాంగోలో ఘోరం.. జైల్లో 129 మంది ఖైదీలు మృతి

డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్ కాంగోలోని సెంట్రల్‌ మకాల జైలులో ఘోరం జరిగింది. ఒకేసారి జైలు నుంచి తప్పించుకునేందుకు ఖైదీలు ప్రయత్నించారు. జైలులో ఉన్నవారంతా దాదాపుగా ఒక్కసారి తప్పించుకోవాలని చూశారు. మకాల జైలును బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 129 మంది ఖైదీలు చనిపోయారని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈవిషయాన్ని ఇంటీరియర్ మంత్రి షబాని లుకో మంగళవారం ఎక్స్‌ వేదికగా తెలిపారు. 129 మందిలో 24 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారని వెల్లడించారు. ఈ సంఘటన కాంగో వ్యాప్తంగాం సంచలనంగా మారింది. చర్చనీయాంశం అవుతోంది.

కాంగో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మకాల జైలు నుంచి తప్పించుకునేందుకు ఖైదీలంతా ఒక్కసారిగా గుమిగూడారు. ఆ తర్వాత జైలును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అప్పుడే గార్డులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. తొక్కిసలాట చోటుచేసుకుంది. మరోవైపు తోపులాట.. ఉద్రిక్తల నేపథ్యంలో జైలులో ఉన్న కిచెన్‌లో మంటలు చెలరేగాయి. ఈ తొక్కిసలాట, ఆ తర్వాత మంటల్లో చిక్కుకుని మొత్తం 129 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. మరో 59 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారికి చికిత్స చేయిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఈ సంఘటనతో అడ్మినిస్ట్రేటివ్ భవనం కూడా దెబ్బతిన్నదని అధికారులు చెప్పారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తున్నట్లు మంత్రి షబాని లుకో చెప్పారు. మరోవైపు ఈ సంఘటనపై ఖైదీలు మరోలా వాదన వాదిస్తున్నారు. తమకు బయట నుంచి భారీ కాల్పుల చప్పుళ్లు వినిపించాయనీ ఖైదీలు చెప్పినట్లు అక్కడి మీడియా సంస్థలు చెప్పాయి.

Next Story