క‌రోనా వైర‌స్ పుట్టింది భార‌త్‌లోనంట‌..! ‌చైనా సంచలన ఆరోపణ

China sensational allegation.. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది

By సుభాష్  Published on  28 Nov 2020 6:51 PM IST
క‌రోనా వైర‌స్ పుట్టింది భార‌త్‌లోనంట‌..!  ‌చైనా సంచలన ఆరోపణ

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది త‌ప్ప త‌గ్గ‌డం లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి రోజు ల‌క్ష‌ల్లో కేసులు న‌మోదు అవుతుండ‌గా.. వేల‌ల్లో ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్నారు. ఇక ఈ వైర‌స్ పుట్టింది ఎక్క‌డ అని అడిగితే.. చైనాలోని వుహాన్ న‌గ‌రంలో పుట్టింద‌ని దాదాపు అన్ని దేశాలు చెబుతున్నాయి. ఇక అగ్ర రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే.. ఓ అడుగు ముందుకు వేసి ఇది చైనా వైర‌స్ అని పిలిచిన సంద‌ర్భాలున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా చైనా స‌రికొత్త వాద‌న‌ను తెర‌పైకి తెచ్చింది. ఈ మ‌హ‌మ్మారి భార‌త్ లేదా బంగ్లాదేశ్‌లో పుట్టి ఉండొచ్చున‌ని చైనా శాస్త్ర‌వేత్త‌లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 2019 డిసెంబరులో వుహాన్ లో కరోనా వ్యాప్తి చెందగా, అంతకుముందే భారత్, బంగ్లాదేశ్ లో ఈ వైరస్ ఉనికి వెల్లడైందని చైనాలోని షాంఘై ఇన్ స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు వివరించారు. కొవిడ్-19 పుట్టింది తమ దేశంలో కాదనడానికి ఆధారాలు ఉన్నాయని, 2019 వేసవిలోనే ఇది భారత గడ్డపై పుట్టిందని, జంతువుల నుంచి కలుషితమైన నీటి ద్వారా మానవులకు సంక్రమించిందని చైనా పరిశోధకులు వెల్లడించారు. వుహాన్ లో పుట్టిందే నిజమైన కరోనా వైరస్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని వారు స్పష్టం చేశారు.

విభిన్న ఉత్పరివర్తనాల ద్వారా వైరస్ యొక్క మూలాన్ని గుర్తించే ప్రయత్నంలో ఈ బృందం ఫైలోజెనెటిక్ విశ్లేషణను చేసింది. అతి తక్కువ ఉత్పరివర్తనాలతో ఉన్న జాతి అసలుదని వారు వాదించారు. దీన్ని ప్రమాణంగా చూపుతూ పరిశోధకులు మొదటి కేసులు వుహాన్ లో నమోదవ్వలేదని వాదిస్తున్నారు. అందుకు బదులుగా భారతదేశం బంగ్లాదేశ్ వైపు వేలు చూపిస్తున్నారు. ఎందుకంటే తక్కువ మ్యుటేషన్లతో వైరస్ జాతులు ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చెందాయన్నది వారి వాదన. వైరస్ ఎక్కడ మొదలైందో ఆరోపించడానికి చైనా అధికారులు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో యుఎస్ ఇటలీలను మొదటి కరోనా కేసులు నమోదైనట్లు వ్యాఖ్యలు చేశారు.

కాగా.. ఈ చైనా పరిశోధకుల వాదనను భారత్ సహా ఇతర దేశాల్లోని పరిశోధకులు ఎవరూ విశ్వసించడంలేదు. భారత ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్న వైరాలజిస్ట్ ముఖేశ్ ఠాకూర్ షాంఘై ఇన్ స్టిట్యూట్ అధ్యయనంలోవి అన్నీ తప్పుడు వాదనలేనని ఖండించారు. అంతర్జాతీయ నిపుణుడు డేవిడ్ రాబర్ట్ సన్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు.

Next Story