బ్రిటన్ యువరాణికి క్యాన్సర్.. వీడియో రిలీజ్

బ్రిటన్‌ రాజు చార్లెస్‌ పెద్ద కోడలు, ప్రిన్స్‌ విలియమ్ సతీమణి సంచలన ప్రకటన చేశారు.

By Srikanth Gundamalla  Published on  23 March 2024 3:45 AM GMT
britain, princes kate middleton,  cancer,

 బ్రిటన్ యువరాణికి క్యాన్సర్.. వీడియో రిలీజ్ 

బ్రిటన్‌ రాజు చార్లెస్‌ పెద్ద కోడలు, ప్రిన్స్‌ విలియమ్ సతీమణి సంచలన ప్రకటన చేశారు. ప్రజలకు ముందుకు వచ్చిన యువరాణి కేట్‌ మిడిల్టన్‌.. తాను క్యాన్సర్‌ సమస్యతో పోరాడుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు 42 ఏళ్ల కేట్‌ మిడిల్టన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు స్వయంగా వీడియో చేసి దాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

బ్రిటన్ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ వీడియోలో మాట్లాడుతూ.. పొత్తికడుపు సర్జరీ తర్వాత తాను టెస్టులు చేయించుకున్నట్లు చెప్పారు. ఆ పరీక్షల్లో తనకు క్యాన్సర్ సోకినట్లు వీడియో ద్వారా తెలిపారు. కీమోథోరపీ చేయించుకోవాలని వైద్యులు సలహాఇచ్చారనీ.. ప్రస్తుతం చికిత్స ప్రారంభ దశలోనే ఉన్నట్లు తెలిపారు. ఈ విషయం తమ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు కేట్. ఏదీ ఏమైనా ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భర్త విలియమ్‌ సహకారంతో చేయాల్సిందంతా చేస్తామని అన్నారు. ఈ సమయంలో తమ కుటుంబం ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని అనుకుంటున్నట్లు కేట్ వీడియోలో తెలిపారు.

ఇక ఇంతకుముందే బ్రిటన్ రాజు చార్లెస్‌ (75) కూడా క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఆయన చికిత్స పొందుతున్నారని ఫిబ్రవరిలో బకింగ్‌హమ్ ప్యాలెస్ తెలిపింది. ఆయన చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే యువరాణి కేట్‌ కూడా క్యాన్సర్ బారిన పడటం బ్రిటన్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కాగా.. విలియమ్‌, కేట్‌ వివాహం 2011లో జరిగింది. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. కేట్‌ మిడిల్టన్‌ క్యాన్సర్‌ నుంచి కోలుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు సందేశాలు పంపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో పాటు బ్రిటన్ రాజకీయ ప్రముఖులు ఈ మేరకు మెసేజ్‌లు పంపారు.


Next Story