మరింతగా పెరిగిన ముడిచమురు ధరలు
By - Nellutla Kavitha |
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర బ్యారెల్ కు 130 డాలర్లకు చేరుకుంది. రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన తర్వాత ముడి చమురు ధరలు పెరగడం ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం బ్యారెల్ 130 డాలర్లుగా నమోదైంది. దీనికి ప్రధాన కారణం రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల పై అమెరికా నిషేధం విధించడమే. మరోవైపు బ్రిటన్ కూడా ఈ ఏడాది చివరి వరకు రష్యా నుంచి ముడి చమురును తీసుకోబోమని ప్రకటించింది. నిన్న ఉదయం అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యా నుంచి ముడి చమురు తో పాటుగా సహజవాయువును కూడా తీసుకోబోమని ప్రకటించారు. అమెరికా పోర్టులు రష్యా నుంచి ఎలాంటి ముడి చమురును అనుమతించబోవని, అమెరికా ప్రజలు యుద్ధం చేస్తున్న రష్యాకు గట్టి దెబ్బ తగిలేలా చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు నిన్న వైట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వెనువెంటనే బ్రిటన్ కూడా ఈ సంవత్సరం చివరి వరకు రష్యా నుంచి చమురు తో పాటుగా ఇతర ఉత్పత్తులను కూడా దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్టుగా ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ ఇదే బాటలో ఇతర యూరోపియన్ దేశాలు కూడా పయనిస్తే చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రష్యా నుంచి సగానికిపైగా ముడిచమురు యూరోపియన్ మార్కెట్ కే వెళ్తుంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 130 డాలర్లుగా ఉంది. అంటే గతంతో పోలిస్తే 6.7 శాతం పెరిగింది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 14 వ రోజుకు చేరుకుంది. ఇది ఇలాగే కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు.