కుప్పకూలిన బిల్డింగ్, ఆరుగురు చిన్నారులు సహా 14 మంది మృతి
బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈశాన్య రాష్ట్రమైన పెర్నాంబుకోలో ఒక భవనం కుప్పకూలింది.
By Srikanth Gundamalla Published on 9 July 2023 12:48 PM ISTకుప్పకూలిన బిల్డింగ్, ఆరుగురు చిన్నారులు సహా 14 మంది మృతి
బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆ దేశ ఈశాన్య రాష్ట్రమైన పెర్నాంబుకోలో ఒక భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు సహా మొత్తం 14 మంది మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ భవనం కుప్పకూలింది. ఇళ్లు లేని వారు ఈ భవనంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇంకా కొంత మంది భవనం శకలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని బయటకు తీసేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
1970లో ఈ భవన నిర్మాణం జరిగింది. దాంతో శిథిలావస్థకు చేరుకుంది. అయితే.. భవనం బాగా పాతది అవడంతో దాంట్లో ఉండొద్దని 2010 నుంచే నిషేధం విధించారు. కానీ ఇళ్లు లేని కొన్ని కుటుంబాలు ఈ భవనాన్ని ఆక్రమించుకుని ఆశ్రయం పొదుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. నిషేధ ఆదేశాలను లెక్క చేయకుండా అక్రమంగా నివాసం ఉండటమే వారి ప్రాణాలను బలితీసుకుందని చెప్పారు. భవనం కూలిన వెంటనే సమాచారం అందుకున్న సమాయ బృందాలు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు శిథిలాల కింద చిక్కుకున్న 15 ఏళ్ల చిన్నారి, 65 ఏళ్ల వృద్ధురాలిని ప్రాణాలతో బయటకు తీసినట్లు అధికారులు చెప్పారు. మరో యువకుడిని కూడా కాడామని.. కానీ అతను చికిత్స పొందుతూ మరణించాడని అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు మనుషులను శిథిలాల కింద నుంచి బయటకు తీశామని చెప్పారు. మనుషులను కాపాడిన తర్వాత జంతువులను కాపాడతామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఇళ్లు లేని నిరాశ్రయులకు ఇళ్లు కట్టించి ఉంటే ఇంతటి ప్రాణనష్టం జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పెర్నాంబుకో దగ్గర ఒలిండాలో గత ఏప్రిల్‌లో కూడా భవనం కూలింది. అప్పుడు ఐదుగురు మృత్యువాత పడ్డారు.