దంపతులు కలిసి స్నానం చేయండి.. మేయర్ వింత సూచన
కొలంబియా దేశ రాజధాని బొగోటా ప్రజలకు అక్కడి మేయర్ కార్లోస్ ఫెర్నాండో గలాన్ వింత సూచనలు చేశారు.
By Srikanth Gundamalla Published on 13 April 2024 2:26 AMదంపతులు కలిసి స్నానం చేయండి.. మేయర్ వింత సూచన
కొలంబియా దేశ రాజధాని బొగోటా ప్రజలకు అక్కడి మేయర్ కార్లోస్ ఫెర్నాండో గలాన్ వింత సూచనలు చేశారు. నీటిని పొదుపు చేయాలనీ.. అందుకు కొన్ని పద్ధతులను అవలంభించాలని కోరారు. స్నానం చేసేటప్పుడు దంపతులు కలిసి చేయాలని విజ్ఞప్తి చేశారు. బొగోటా మేయర్ ఫెర్నండో గలాన్ ప్రకటన సంచలనంగా మారింది. ఆయన చేసిన సూచన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు ఆయన సూచనలను సమర్ధిస్తే.. మరికొందరు ఇదెక్కడి సూచన అంటూ విమర్శలు చేస్తున్నారు.
2023 ఏడాదిలో ఎల్ నినో కారణంగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. వర్షాలు పెద్దగా పడలేదు. అంతేకాదు.. ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే రిజర్వాయర్లలో నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి కొనసాగుతోంది. ఈ ఎల్‌నినో ప్రభావం కొలంబియా దేశ రాజధాని బొగోటాపై కూడా పడింది. బొగోటా నీటి అవసరాలలో 70 శాతం నీటి సరఫరా చేసే చింగాజా నీటి వ్యవస్థను తయారు చేసే మూడు రిజర్వాయర్లు కేవలం 16.9 శాతం సామర్థ్యంతో ఉన్నాయని గలాన్ చెప్పారు.
రిజర్వాయర్లు చరిత్రలోనే ఎప్పుడూ లేనంత కనిష్ట నీటి సామర్థ్యంతో ఉన్నాయని అక్కడి స్థానిక నివేదకలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బొగోటా మేయర్ ఫెర్నాండో గలాన్ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ప్రజలు రోజువారీ పరిశుభ్రత పద్ధతులను పూర్తిగా వదిలివేయాలని అభ్యర్థించారు. ఆదివారం లేదా వారంలో మరేదైనా ఇంటి నుంచి బయటకు వెళ్లకపోతే ఆ రోజు స్నానం చేయడం వదిలేయాలని చెప్పారు. ఇలా చేయడం ద్వారా నీరు ఆదా అవుతుందని అన్నారు. ఇక స్నానం దంపతులు కలిసి చేయడం ద్వారా నీటిని మరింత చేసేందుకు అవకాశాలు ఉంటాయని మయర్ గలాన్ పేర్కొన్నారు. నీటి ఎద్దడి ఉన్న నేపథ్యంలో చుక్క నీటిని వృథా చేయొద్దనీ.. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పదని బొగోటా మేయర్ ప్రజలకు సూచనలు చేశారు