లిబియా తీరం వద్ద పడవ బోల్తా, 60 మంది మృతి
లిబియా తీరం వద్ద విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో బయల్దేరిన ఓ పడవ తీరం దగ్గర సమద్రంలో బోల్తా పడింది.
By Srikanth Gundamalla
లిబియా తీరం వద్ద పడవ బోల్తా, 60 మంది మృతి
లిబియా తీరం వద్ద విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో బయల్దేరిన ఓ పడవ తీరం దగ్గర సమద్రంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం ఐరోపాకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపింది. జువారా పట్టణం తీరంలో బలమైన అలల తాడికికి పడవ కొట్టుకుపోయిందనీ.. ఆ తర్వాత పడవ బోల్తా పడటంతో 60 మంది చనిపోయారనీ తెలిపారు.
మధ్యధారా సముద్రంలోని ఈ మార్గంలో గతంలో కూడా ప్రమాదాలు సంభవించాయి. అయినా కూడా చాలా మంది ఇదే మార్గంలో వస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. మెరుగైన జీవితాన్ని ఆరంభించేందుకు ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపా దేశాలకు వలస వెల్తున్నారు. పేదరికం నేపథ్యలో పశ్చిమ ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి ప్రతి ఏటా వేల మంది ఐరోపాకువలస వెళ్తుంటారు. ఇలాంటి వారందరికీ లిబియా రావాణా కేంద్రంగా మారింది. ఇక్కడి భూభాగంలో ఎవరికీ సరైన నియంత్రణ లేకపోవడంతో ఐరోపాకు చేరుకోవాలనుకునే వారు ఈ దేశ తీరం నుంచే వెళ్తున్నారు. ఒక్క 2023 ఏడాదిలోనే ఇప్పటి వరకు దాదాపు 2వేలకు పైగా మంది ఇక్కడ చనిపోయారని ఐఓఎం అధికార ప్రతినిధి తెలిపారు.
లిబియా ఆరు దేశాలతో సరిహద్దులు పంచుకుంటోంది. దాంతో.. ఆఫ్రికా దేశాల నుంచి వలసదారులకు అనుకూలంగా మారింది. ఇలాంటి వారిని ప్రమాదకరమైన పడవల్లో కుక్కి తీరం దాటిస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా పట్టుబడి తిరిగి లిబియాకు వస్తే.. వారిని ప్రభుత్వ నిరాశ్రయ కేంద్రాల్లో ఉంచుతున్నారు. నిర్బంధ శ్రామికులుగా మారుస్తున్నారు.