బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల రద్దుపై అల్లర్లు.. 32 మంది మృతి

బంగ్లాదేశ్‌లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు.

By Srikanth Gundamalla  Published on  19 July 2024 3:22 AM GMT
Bangladesh, reservation protests,  32 dead,

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల రద్దుపై అల్లర్లు.. 32 మంది మృతి

బంగ్లాదేశ్‌లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయంతో కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు దాదాపు 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

గురువారం కూడా ఆందోళన కారులు దేశ వ్యాప్తంగా బంద్‌ చేపట్టారు. ఈ బంద్‌ కార్యక్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఘర్షణల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2500 మందికి గాయాలు అయ్యాయి. ఆందోళనల మధ్యే దేశవ్యాప్తంగా బంద్‌ కొనసాగింది. జీన జీవనం స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాణిజ్య సంస్థలు, దుకాణాలు, మార్కెట్లు, రవాణా వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వం సైన్యాన్ని మోహరింపజేసింది. మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. వారు ఎప్పుడు వస్తే అప్పుడు చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ.. ఈ ప్రభుత్వ ఆహ్వానాన్ని విద్యార్థి సంఘాలు తిరస్కరించాయి. దాంతో.. పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను సంస్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు వారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బంద్‌ చేపట్టారు. ఇప్పటికే విద్యా సంస్థలను ప్రభుత్వం మూసివేసింది. అయినా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. పోలీసులు కొన్నిచోట్ల రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించారు. ఆందోళనకారులు, ప్రభుత్వ అనుకూల విద్యార్థి సంఘ నేతలు ఇటుకలు, వెదురు కర్రలతో ఘర్షణపడ్డారు. వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Next Story