బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు, భారతీయులకు కేంద్రం అలర్ట్
బంగ్లాదేశ్‌లో గత కొన్నాళ్లుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 1:30 PM ISTబంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు, భారతీయులకు కేంద్రం అలర్ట్
బంగ్లాదేశ్‌లో గత కొన్నాళ్లుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ బంగ్లాదేశ్‌లోని యూనివర్సిటీ విద్యార్థులు దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆందోళనలకు ప్రజలు సైతం మద్దతు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలతో తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. కర్ఫ్యూ కొనసాగుతోంది. అయినా కూడా ఆదివారం బంగ్లాదేశ్‌లో ఒక్కసారిగా చెలరేగిన హింసా ఘటనల్లో ఏకంగా 90కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆదివారం విద్యార్థులకు, అధికార హాసీనా పార్టీ మద్దతుదారులకు మధ్య చోటు చేసుకున్న హింసలో 93 మంది మరణించారు. వారిలో 14 మంది పోలీసులు ఉన్నారు. హింసా సంఘటనల్లో చాలా మంది గాయపడ్డారు. వారిని అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆదివారం జరిగిన ఘటనలతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయులకు పలు కీలక సూచనలు చేసింది.
బంగ్లాదేశ్‌లో చేసుకుంటున్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను భారత్ నిశీతంగా గమనిస్తుంది. ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) కీలక సూచనలు జారీ చేసింది. బంగ్లాదేశ్‌లోని భారత రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులందరికీ సూచించింది. అలాగే తాము తదుపరి నోటీసులు జారీ చేసే వరకు బంగ్లాదేశ్‌లో పర్యటించ వద్దని భారతీయులను ఈ సందర్భంగా హెచ్చరించింది. బంగ్లాదేశ్‌లో ఆందోళనలు నేపథ్యంలో జులై 25న 6,700 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.