బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు.. వరదల్లో 20 మంది మృతి
బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 10:00 AM ISTబంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు.. వరదల్లో 20 మంది మృతి
బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్నవర్షాలతో ఆ దేశంలోని చాలా ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా బంగ్లాదేశ్‌లో ఇప్పటికే 20 మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇక 52లక్షల మంది వరదల్లో ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులు అయ్యారని అధికారులు చెబుతున్నారు.పెద్ద ఎత్తున ప్రజలు నివాసాలను కోల్పోవడంతో పరిస్థితులు దయనీయంగా మారాయి. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆహారం, తాగునీరు, మందులు, దుస్తులు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. మరోవైపు కొన్ని మారుమూల ప్రాంతాల్లో రోడ్లు తెగిపోవడం.. వరద భారీగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
బంగ్లాదేశ్‌లో ఇటీవల తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.గత కొన్నాళ్లుగా అక్కడ తీవ్ర ఆందోళనలు కొనసాగాయి. ఆ పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో.. ప్రకృతి విపత్తులు ఆ దేశాన్ని వణికిస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పరిస్థితులు కాస్త మెరుగువుతున్నాయని వెల్లడించారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన తర్వాత యూనస్ ప్రమాణ స్వీకారం చేశారు.
బంగ్లాదేశ్‌లోని 11 వరద ప్రభావిత జిల్లాల్లో 3,500 షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిల్లో నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు తలదాచుకుంటున్నారని వెల్లడించారు. 750 వైద్య బృందాలు వారికి వైద్య సహాయం అందిస్తున్నాయనీ.. అలాగే వివిధ ప్రాంతాల్లో వరద బాధితులకు సాయం చేసేందుకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు అధికారులు చెప్పారు.