నేడు బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు, ప్రధాన ప్రతిపక్షం దూరం

నేడు బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. కొద్దిరోజులుగా బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  7 Jan 2024 7:08 AM IST
bangladesh, general election, sheikh hasina ,

నేడు బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు, ప్రధాన ప్రతిపక్షం దూరం

నేడు బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. కొద్దిరోజులుగా బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్యే నేడు సాధారణ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. అయితే.. సాధారణ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ దూరంగా ఉంటోంది. అయినా.. కూడా ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఉన్న 300 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సుమారు 11.96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలను ప్రతిపక్షం బీఎన్‌పీ బహిష్కరించింది. దేశవ్యాప్తంగా 48 గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది. దాంతో.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయినా.. అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రైలుకు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. ఆ సంఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బీఎన్‌పీ కార్యకర్తలు నాలుగు పోలింగ్ బూతులపై బాంబులు విసిరారు. అయితే.. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలకు దూరంగా ఉండటంతో మరోసారి ప్రధాని షేక్‌ హసీనా అధికారంలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆమె 2008 నుంచి బంగ్లాదేశ్ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈసారి గెలిస్తే వరుసగా నాలుగోసారి ఆమె ప్రధాని అయినట్లు అవుతుంది.

కాగా.. మొత్తం 27 పార్టీలకు చెందిన 1,500 మంది అభ్యర్థులతోపాటు 436 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. 42 వేల పోలింగ్‌ స్టేషన్లలో ఓటు వేయనున్నారు. భారత్‌కు చెందిన ముగ్గురు సహా వంద మందికి పైగా విదేశీ పరిశీలకులు పోలింగ్‌ నిర్వహణ తీరును పరిశీలిస్తారు. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా.. మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నేత ఖలీదా జియా అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్నారు. ఇదే పార్టీ ఎన్నికలను బహిష్కరించింది.

Next Story