అమెరికా లోని హ్యూస్టన్ లో నిర్వహించిన మ్యూజిక్ ఫెస్టివల్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతిచెందారు. స్టేజ్‌పైకి ట్రావిస్ స్కాట్ రాగానే ఒక్కసారిగా జనం వేదిక వైపు ఎగబడ్డారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 11 మంది హాస్పిటల్‌కు తరలించారు. సుమారు 300 మంది గాయపడ్డారు. 50 వేల మంది ఆ మ్యూజిక్ ఈవెంట్‌కు హాజరైనట్లు పోలీసులు తెలిపారు.
మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించిన పార్క్ వెలుపల తెల్లవారుజామున జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో హ్యూస్టన్ ఫైర్ చీఫ్ శామ్యూల్ పెనా మాట్లాడుతూ పలువురి మరణాలను ధృవీకరించారు. రాత్రి 9 లేదా 9:15 గంటలకు తొక్కిసలాట జరిగిందని అన్నారు. ప్రేక్షకులు వేదిక ముందుకు వెళ్లాలని ప్రయత్నించినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిమాపక విభాగం 17 మందిని ఆసుపత్రులకు తరలించింది. వారిలో 11 మంది కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారని స్థానిక మీడియా ఛానెల్ తెలిపింది. రాపర్ ట్రావిస్ స్కాట్ అక్కడికి రాగానే ప్రేక్షకులు ఒక్కసారిగా ఎగబడ్డారని హ్యూస్టన్ క్రానికల్ తెలిపింది. రెండు రోజుల ఈవెంట్‌కు 50,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారని.. మ్యూజిక్ ఫెస్టివల్ లోని రెండో రోజును రద్దు చేశామని నిర్వాహకులు తెలిపారు.