స్టేడియంలో తొక్కిసలాట, 13 మంది దుర్మరణం
ద్వీప దేశం మడగాస్కర్‌లో ఘోర ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 6:49 AM ISTస్టేడియంలో తొక్కిసలాట, 13 మంది దుర్మరణం
ద్వీప దేశం మడగాస్కర్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. దేశ రాజధాని అయిన అంటనవారివోలో 11వ ఇండియన్ ఓసియన్ క్రీడల పోటీలు నిర్వహించారు. స్టేడియంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకేసారి 50వేలకు పైగా మంది ప్రేక్షకులు క్రీడా మైదానానికి వెళ్లారు. దాంతో.. గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తోపులాట జరిగింది. కొందరు కిందపడిపోవడంతో జనాలు అటూఇటూ పరిగెత్తారు. తొక్కిసలాట జరిగి దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు
ఈ దుర్ఘటన పట్ల మడగాస్కర్ దేశ ప్రధాని క్రిస్టియన్ ఎన్‌స్టే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్రీడా పోటీలను చూసేందుకు వచ్చిన సందర్భంగా తొక్కిసలాట జరగడం.. అందులో 13 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇక మరో 80 మంది గాయాల పాలైనట్లు కూడా వెల్లడించారు క్రిస్టియన్ ఎన్ట్సే. 11వ 'ఇండియన్ ఓసియన్ క్రీడల' పోటీలను అంటనవారివోలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 50,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. దాంతో.. స్టేడియం ముఖద్వారం వద్ద ప్రేక్షకులు ఒక్కసారిగా గుమిగూడారు. లోపలికి వచ్చేందుకు ఆసక్తి కనబర్చి.. ఒకేసారిగా చొచ్చుకువచ్చారు. తొక్కిసలాట జరిగింది. పదల సంఖ్యలో ప్రేక్షకులు కిందపడిపోయారు. దాంతో 13 మంది చనిపోగా.. 80 మంది గాయపడ్డారు. దాంతో వెంటనే స్పందించిన సిబ్బంది.. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఒకరిని ఒకరు తోసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా తెలిపారు. గత 40 ఏళ్లుగా నైరుతి హిందూ మహాసముద్ర దీవుల మధ్య పలు విభాగాల్లో క్రీడల పోటీలను నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ పోటీలను ఈసారి ఈ మడగాస్కర్‌లో నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 3 వరకు ఇవి జరగనున్నాయి. గతసారి ఈ పోటీలు మారిషస్‌లో నిర్వహించారు.