డిసెంబర్‌లో కరోనాతో 10వేల మరణాలు: డబ్ల్యూహెచ్‌వో
ఒక్క డిసెంబర్ నెలలోనే వరల్డ్ వైడ్‌గా కోవిడ్‌తో 10వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 2:58 PM ISTడిసెంబర్‌లో కరోనాతో 10వేల మరణాలు: డబ్ల్యూహెచ్‌వో
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పట్టిపీడిస్తున్నాయి. వైరస్ ప్రభావం తగ్గుతోంది అనుకునే లోపే వేరియంట్ల రూపంలో ప్రజల్లోకి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల జీవనంలో కరోనా ఒక భాగం అయిపోతుంది. అయితే.. మనదేశంలో కరోనా వేరియంట్ల ప్రభావం అంత ఎక్కువగా లేకపోయినా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క డిసెంబర్ నెలలోనే వరల్డ్ వైడ్‌గా కోవిడ్‌తో 10వేల మంది ప్రాణాలు కోల్పోయారు. క్రిస్మస్, థ్యాంక్స్ గివింగ్ సెలవుల్లో ప్రజలు గుమిగూడటం వల్లే కరోనా మహమ్మారి వ్యాప్తి పెరిగి..మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఈ మేరకు మాట్లాడిన డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్.. కరోనా కారణంగా ప్రపంచంలో డిసెంబర్‌లోఏ 10వేల మంది చనిపోయారని అన్నారు. ఇక కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరినవారి సంఖ్య 42 శాతం పెరిగిందని వెల్లడించారు. ముఖ్యంగా ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాల్లో కరోనా వ్యాప్తి మరింత పెరిగినట్లు ఆయన తెలిపారు. అయితే.. ఈ కేసులు కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో నమోదైన కేసులతో పోలిస్తే తక్కవే అయినా.. ఇవన్నీ నివారించాల్సిన దగినవని ఆయన టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. కానీ.. వాటిని అధికారికంగా నమోదు చేయడంలేదని చెప్పారు. అయితే.. కరోనా వ్యాప్తి మరోసారి పెరగకుండా దేశాలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బాధితులకు కావాల్సిన చికిత్స అందించాలని టెడ్రోస్ సూచించారు.
ఇక జేఎన్-1 రకం వేరియంట్ కేసులు ప్రస్తుతం ఎక్కువగా నమోదు అవుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ చెప్పారు. ఇది ఒమిక్రాన్ ఉప వేరియంట్ అని తెలిపారు. అందువల్ల ఇప్పటికే తీసుకున్న వ్యాక్సిన్లు కొంతమేర రక్షిస్తాయని పేర్కొన్నారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో తిరిగినప్పుడు మాస్కులు ధరించడం ముఖ్యమన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మేలని సూచించారు. కరోనా కేసులు సోకకుండా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు ఆపవని.. ఆస్పత్రుల్లో చేరే ముప్పు నుంచి మాత్రమే బయటపడేస్తాయని WHO అత్యవసర విభాగాధిపతి మైఖేల్ ర్యాన్ తెలిపారు.