పులుల గణన ఎలా చేపడతారు.. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం
By సుభాష్ Published on 29 July 2020 2:06 AM GMTపులితో పోరాటం చేయాలంటే ప్రాణాలపై ఆశలను వదులుకోవడమే. అయితే ఇది గతం మాత్రమే. ప్రస్తుతానికి వస్తే పులులను చంపొద్దు... వాటికి కాపాడుకోవాలి చెబుతున్నారు అధికారులు. మనిషి దురాశకు పులులు బలైపోతున్నాయి. ఇందుకు వరల్డ్ లైఫ్ గణాంకాలే నిదర్శనం. అయితే జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా న్యూస్ మీటర్ ప్రత్యేక కథనం.
పులులను రక్షించుకునేందుకు 2010 నుంచి జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1913లో ప్రపంచంలో లక్ష పులులు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 3200లోపే ఉండటం పరిస్థితి ఏ మేరకు దాపురించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ వందేళ్లలో 97శాతం మేర పులులు అంతరించిపోయాయి. విచక్షణ రహితంగా పులులను వేటాడటంతో పాటు అడవుల నరికివేత, ఆహార లభ్యత తగ్గడమే అవి అంతరించిపోవడానికి కారణమని వన్యప్రాణుల నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పులులు సంచరించే అభయారణ్యాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 2010 నుంచి ఏటా జూలై 29న గ్లోబల్ టైగర్ డేగా పాటిస్తున్నారు. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జరిగిన టైగర్ సమ్మిట్ నిర్ణయం మేరకు అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. 2022 నాటికి పులుల సంఖ్య రెట్టింపు చేయాలని లక్ష్యంతో ఉన్నారు.
కాగా, 2010లో ప్రపంచ వ్యాప్తంగా 3200 పులులు ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 3890కి చేరింది. పులుల జనాభాలో పెరుగుదల సుమారు 22శాతం ఉందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రపంచంలో 690 పులులు పెరుగగా, ఒక్క భారత్ లోనే వాటి సంఖ్య 500 పెరగడం విశేషం. ప్రపంచంకెల్లా ఎక్కువ పులులు ఉన్న దేశ మనదేశమే.
వన్య ప్రాణుల గణాంక ఎలా జరుగుతుంది..?
వన్యప్రాణుల గణాంక సేకరణ దేశంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో జరుగుతుంది. అటవీ సిబ్బంది రోజూ సుమారు నాలుగైదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పులులతో పాటు ఇతర వన్యప్రాణుల ఆధారాలను అన్వేషిస్తారు.
ఐదు పద్దతుల్లో వీటి గణాంకాలను సేకరణ
భారత్‌లో నాలుగేళ్లకోసారి పులులను లెక్కిస్తుంటారు. సుమారు ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గణన సాగుతుంది. ఐదు పద్దతుల్లో వీటి గణాంకాల సేకరణ జరుగుతుంది. అటవీ సిబ్బంది నడిచే మార్గంలో వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే వాటి గుర్తులతో పాటు ఏ ప్రదేశంలో ఎంత సమయానికి కనిపించాయనే వివరాలను నమోదు చేసుకుంటారు. పగ్ మార్క్ విధానంలో సిబ్బంది అడవిలో నడుచుకుంటూ పులుల పాదముద్రలను గుర్తిస్తారు.
పులి పాదముద్రను బట్టి వయసు నిర్దారిస్తారు
మొదటగా ఒక గాజుపలకపై స్కెచ్ పెన్ తో పాదముద్ర ఆకారాన్ని గీస్తారు. తర్వాత గాజుపలకపై తెల్లటి కాగితాన్ని ఉంచి ఆకారాన్ని దానిపై పడేలా చూస్తారు. నేలపై పాదముద్ర చుట్టూ ఓ రింగ్ను ఏర్పాటు చేసి పాదముద్రపై చాక్ పౌడర్ చల్లుతారు. ఆ తర్వాత రింగ్ అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమాన్ని వేస్తారు. దాదాపు ఓ 20 నిమిషాల తర్వాత ఆ మిశ్రమం గడ్డకట్టి పాదముద్ర అచ్చులా ఏర్పడుతుంది. పాదముద్రలు ఏ ప్రాంతంలో, ఏ సమయంలో గుర్తించినది నమోదు చేసుకుంటారు. పాదముద్ర ఎన్ని సెంటీమీటర్ల మేర ఉందనేదాన్ని బట్టి పులి వయసును నిర్ణయిస్తారు.
అడవుల్లో కనిపించే పులుల మలాన్ని సేకరించి, సిలికాన్ జెల్ ఉన్న డబ్బాలో పెట్టి హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ)కి పంపిస్తారు. అక్కడ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి పులుల సంఖ్యతోపాటు వాటి ఆరోగ్య పరిస్థితిని గుర్తిస్తారు.
ఇక అడవి జంతువులకు చెట్లకు, రాళ్లకు వాటి పాదాలను, శరీరాన్ని రుద్దుకుంటాయి. గోళ్లు పెరిగినప్పుడు వాటిని తగ్గించుకునేందుకు శరీరంపై రురదను పోగొట్టుకునేందుకు ఇలా చేస్తుంటాయని, అప్పుడు వాటి వెంట్రుకలు, గోళ్లు ఊడిపోతుంటాయని అధికారులు చెబుతున్నారు. అటవీ సిబ్బంది చెట్లు, రాళ్లపై పడ్డ గాట్లను పరిశీలించి అక్కడ సంచరించిన జంతువు ఏదో గుర్తించగలుగుతారు. సేకరించిన వెంట్రుకలు, గోళ్లకు డీఎన్ఏ పరీక్ష చేసి ఆ జంతువు ఏదన్నది నిర్ధారిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పులుల సంఖ్య
కాగా, తెలుగు రాష్ట్రాల్లో పులుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తెలంగాణలో 26 పులులు, ఏపీలో 48 పులులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. బుధవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా దేశంలో పులుల గణనకు సంబంధించి భారత పులుల సర్వే -2018 పేరిట రూపొందించిన నివేదికను మంగళవారం ఢిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ విడుదల చేశారు. ఈ మేరకు 2014నిర్వహించిన సర్వేతో పోలిస్తే తెలంగాణ, ఏపీలో ఆరు పులులు పెరిగాయని వెల్లడించారు. తెలంగాణలో పులుల సంఖ్య లెక్కపెట్టడానికి మొత్తం 658 కెమెరాలను తెలంగాణ అటవీ శాఖలో ఏర్పాటు చేసినట్లు నివేదికలో తెలిపారు.