అమ్మ పలుకే బిడ్డకు తొలి భాష.. అదే మాతృభాష
By సుభాష్ Published on 21 Feb 2020 9:23 AM GMTకాలగర్భంలో కమ్మనైన ‘అమ్మ’ భాషలు. మమ్మీ డాడీ సంస్కృతిలో మరుగున పడుతున్న మాతృభాషలు. అన్యభాషలపై ఉన్న మోజు.. అమ్మ భాషపై అక్కరలేదా..? మానవ వికాసానికి దోహదం చేసే.. మాతృభాషను కాపాడుకోలేమా..? పతనావస్థలో.. అమ్మ ‘పలుకులు’.. నేడు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా 'న్యూస్ మీటర్' ప్రత్యేక కథనం.
నీతి, నిజాయితీ, మంచి నడవడిక నేర్పేది మాతృభాష. తల్లి భాష లేనిదే మానవజాతికి వికాసం లేదు. అన్యభాషలు ఎన్ని నేర్చినప్పటికీ.. మాతృభాషలో ప్రవీణుడు కానివాడు.. విజ్ఞాన సముపార్జన చేయలేడు. అలాంటి తల్లిభాష నేడు తల్లడిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా వేలకొద్ది మాతృభాషలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయంటూ యునెస్కో హెచ్చిరిస్తోంది. మరి, మాతృభాషను కాపాడుకోవాలంటే ఏంచేయాలి..? కమ్మనైన అమ్మ భాషను ఎలా కాపాడుకోవాలి..?
అమ్మభాష అంటే అందరికీ ఇష్టమే
అమ్మభాష అంటే అందరికీ ఇష్టమే! తెలుగు మాటలూ, పాటలూ కూడా మనకు మక్కువే. మరి ఎందుకని తెలుగు భాష మనుగడ గురించి కలవరపడుతున్నాం..? ఎందుకు ఏళ్ల తరబడి చర్చోపచర్చలు జరుపుతున్నాం..? ఎందుకంటే... తెలుగంటే నవతరానికి చులకన. ఆంగ్లభాషకే తల్లిదండ్రుల మద్దతు. మరోవైపు ప్రభుత్వాల పట్టింపులేనితనం.. ఇలా అమ్మభాషకు అడుగడుగునా అగచాట్లు. మాతృ భాషకు అధికారిక హోదా ఇచ్చి, అన్నిటా దానికి చెల్లుచీటి ఇస్తే... భాష బతికేదెలా..? కానీ, ఇప్పుడదే జరుగుతోంది.
తల్లి ఒడే బిడ్డకు తొలి బడి.. అమ్మ పలుకే బిడ్డకు తొలి భాష
తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. అమ్మ పలుకే బిడ్డకు తొలి భాష. అదే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే.. మాతృభాషను కూడా కాపాడుకోవాలి. ప్రపంచంలో ఎన్ని భాషలున్నా మాతృభాష పంచే మాధుర్యం ముందు మరేదీ సాటిరాదు. జీవనోపాధికి ఎన్ని భాషలు నేర్చుకున్నా భావాన్ని ప్రస్ఫుటంగా తెలపగలిగేది అమ్మ భాష ఒక్కటే. భావోద్వేగాన్ని స్పష్టంగా ఎదుటివారికి తెలిపేందుకు మాతృభాషను మించిన సాధనం మరొకటి లేదు. ఒక ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేది.. మాతృభాష ఒక్కటే. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తుచేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు.
అమ్మ భాషను రక్షించుకోవడానికి..
అమ్మ భాషను రక్షించుకోవడానికి 1999లో 30వ యునెస్కో మహాసభ ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వేల స్థానిక భాషలున్నా.. కొన్ని వందల భాషలకే విద్యా వ్యవస్థలో చోటు దక్కింది. ఈ రోజును ఎంచుకోవడానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్. దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్‌ను తూర్పు పాకిస్థాన్‌గా పిలిచేవారు. వారి మాతృభాష బెంగాలీ. కానీ, వారి భాషకు తగిన గుర్తింపు లేదు. అందుకే, తమ భాషకు గుర్తింపు ఇవ్వాలని అక్కడి ప్రజలు ఉద్యమించారు. ఆ ఉద్యమం 1952 నుంచి నాలుగేళ్లపాటు సాగింది. విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా దీనిలో పాల్గొన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం.. మేధావుల్ని, అధ్యాపకులను జైళ్లలో వేసింది. ఫిబ్రవరి 21న పోలీసులతో కాల్పులు జరిపించింది.
మాతృభాష కోసం నెత్తురు ఏరులై పారింది
మాతృభాష కోసం మొదలుపెట్టిన ఆ ఉద్యమంలో నెత్తురు ఏరులైపారింది. చివరికి దిగొచ్చిన పాక్ ప్రభుత్వం 1956లో బెంగాలీ, ఉర్దూ భాషలను అధికార భాషలు చేసింది. అయితే, 1953 నుంచే బంగ్లాదేశ్ ప్రజలు ఫిబ్రవరి 21ని మృతవీరుల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ఆ దేశ అభ్యర్థన మేరకు యునెస్కో ఆ రోజునే మాతృభాష దినోత్సవంగా జరిపేందుకు సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు భారత్, పాక్ సహా 28 దేశాలు మద్దతిచ్చాయి.
ఆంగ్లభాష కారణంగా నలిగిపోతున్న మాతృభాషలెన్నో
భాష.. కేవలం భావాలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనమే కాదు, ఒక జాతి ఉనికిని, సంస్కృతిని మొత్తంగా జీవన విధానాన్నే పరిచయం చేస్తుంది. సమాజం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అయితే.. భాషలు అంతరించిపోతున్నాయి. భాష అంతరించిదంటే.. ఆ భాష మాట్లాడే సమూహం అంతరించినట్లేనని భావించాలి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మాతృభాషలు అంతర్థానమయ్యే స్థితిలో ఉన్నాయి. ఆంగ్లభాష అనే రోడ్డు రోలర్ కిందపడి ఇప్పటికే బక్కచిక్కిన మాతృభాషలెన్నో నలిగి కనుమరుగైపోయాయని.. ఇటీవలి యునెస్కో సర్వే తేల్చింది. ప్రపంచంలో సుమారు ఏడు భాషల్లో, 230 భాషలు అంతరించాయి. ఇంకా 3 వేల భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో వెల్లడించింది. ఈ భాషల జాబితాలో తెలుగు భాష ఉందని యునెస్కో ప్రకటించింది. ఒక భాషను మాట్లాడే జనాభాలో ముప్ఫై శాతం మంది ఆ భాషను చదవకుండా, తల్లి భాషకు దూరమైతే ఆ భాష కాలక్రమంలో మృతభాషగా మారుతుందని యునెస్కో సూత్రీకరించి, తెలుగుకు ఆ పరిస్థితి రాబోతుందని ప్రకటించింది. ఇది తెలుగు భాషాభిమానులను కలవరపర్చే విషయం.
కనుమరుగవుతున్న భాషలు
ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు వారాలకు ఒక భాష కనుమరుగవుతోందట. భారత్‌లో నలభైకి పైగా భాషలు, మాండలికాలు అదే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గదబ, నైకీ అనే గిరిజనతెగల భాషలున్నాయి. పదివేల మంది కంటే తక్కువగా మాట్లాడే భాషలు క్రమంగా కాలగర్భంలో కలిసి పోతాయని పరిశోధకులు చెబుతున్నారు.
మనదేశంలో 780 భాషలకు పైగా ఉనికిలో ఉండగా, గత 50 ఏళ్లలోనే 220 భాషలు కనబడకుండా పోయాయి. దీనిని బట్టి భారతీయ భాషలు ఎంత వేగంగా అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయన్నది స్పష్టమవుతోంది. యునెస్కో ఆధ్వర్యంలో నిర్వహించిన వర్గీకరణ ప్రకారం భారత్‌లోని 197 భాషలు ఈ కోవలోకే వస్తాయి. వల్నరబుల్, డెఫినెట్లి ఎండేంజర్డ్, సివియర్లీ ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్‌గా ఆ సంస్థ వర్గీకరించింది. వీటిలో బొరొ, మీథీ మాత్రమే భారత్‌లో అధికారికంగా గుర్తించినవి. ఇతర భాషలకు లిఖిత వ్యవస్థ లేదు.
జననగణన డైరెక్టరేట్ నివేదిక ప్రకారం.. మనదేశంలో 22 షెడ్యూల్డ్ భాషలతో పాటు, లక్షకు పైగా మంది మాట్లాడే వంద నాన్–షెడ్యూల్డ్ భాషలున్నాయి. అయితే యునెస్కో రూపొందించిన కనుమరుగయ్యే ప్రమాదమున్న భాషలు, మాండలికాల జాబితాలో 40 భారతీయ భాషలున్నాయి. ఈ భాషలను పదివేల మంది కంటే తక్కువ మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ భాషలు అంతరించే ప్రమాదముందని భాషావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి, మాతృభాష వల్లనే వస్తుందని,.. స్వభాషలో విద్య ఉంటే, స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని' గాంధీజీ 1938లోనే చెప్పారు. మాతృభాషలో విద్యను బోధిస్తే మానసిక వికాసానికి, సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదం చేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి పరమావధి కావాలి.