విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దుర్గా శరన్నవరాత్రులు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున జగన్మాత.. భక్తులకు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల
సకల దరిద్రాలు పోతాయని భక్తుల నమ్మకం. అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై కనకపు ధగధగలతో అమ్మవారు మెరిసిపోయారు. శక్తి స్వరూపిణి కనక దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు భక్తిభావంతో తన్మయత్వం చెందారు.

రాత్రి 11 గంటల వరకూ నిరంతరాయంగా దర్శనానికి భక్తులు తరలివచ్చారు. సుమారు లక్ష మందికి పైగా అమ్మను దర్శించుకున్నారని అధికారుల అంచనా. సాయంత్రం ఉత్సవ మూర్తులతో నిర్వహించిన నగరోత్సవం డప్పు కళాకారులు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలతో కనుల పండుగగా సాగింది.

ఇంద్రకీలాద్రి దిగువున్న ఉన్న ఘాట్‌రోడ్డు, రావిచెట్టు సెంటర్‌, వినాయకుని గుడి క్యూ మార్గాలు కిటకిటలాడాయి. జైదుర్గా.. జైజై జగజ్జననీ అంటూ భక్తుల నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగింది. భక్తుల పుణ్యస్నానాలతో (జల్లు స్నానం) దుర్గాఘాట్‌ రద్దీగా మారింది. కేశ ఖండనశాలలో దుర్గమ్మకు పెద్దసంఖ్యలో భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో రెండో రోజు జగన్మాత బాలాత్రిపుర సుందరీదేవి గా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మను ధ్యానించడంతో సమస్త మనోవికారాలు తొలిగి నిత్య సంతోషం కలుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మను ఈ రోజు అరుణవర్ణ వస్త్రాలు ధరించి ఎర్రని పూలతో పూజ చేస్తారు.

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.